కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతో ప్రమాదంలో తెలంగాణ నీటి హక్కులు | Harish Rao Open Letter to CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతో ప్రమాదంలో తెలంగాణ నీటి హక్కులు

Jun 6 2026 5:17 AM | Updated on Jun 6 2026 5:17 AM

Harish Rao Open Letter to CM Revanth Reddy

ఎత్తిపోతల పంపులపై నిర్లక్ష్యం.. ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం 

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ 25 శాతానికే పరిమితం 

రైతు డిస్కమ్‌ ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి 

సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో హరీశ్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మోటార్ల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంతో కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఈ మేరకు హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ‘లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో భారీ మోటార్లను పదేపదే ఆన్‌ ఆఫ్‌ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని మేము ముందుగానే హెచ్చరించినా, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.

ప్రాజెక్టులను బలహీనపరచి ఆ నెపాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మోపే ప్రయత్నం జరుగుతుందనే అనుమానం కలుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటిని కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టు ద్వారా పూర్తిగా వినియోగించుకోవడం లేదు. కాంగ్రెస్‌ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ట స్థాయికి పడిపోయింది.

కృష్ణా జలాల్లో తెలంగాణ తాత్కాలిక వాటా 34 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు వాటా 66 శాతం. 2025–26లో ఏపీ వినియోగం 74.90 శాతానికి పెరగ్గా తెలంగాణ వినియోగం ఎన్నడూ లేనంత అత్యంత కనిష్ట స్థాయిలో 25.10 శాతానికి పడిపోయింది. తెలంగాణ జల హక్కులు, రైతుల ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనం’అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. 

సోలార్‌ విద్యుత్‌తో సాగునీటి రంగానికి ముప్పు 
‘సోలార్‌ విద్యుత్‌ అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంపులు నడపాలని ట్రాన్స్‌కో సూచించడంతో భారీ పంపులను తరచూ ఆన్‌ ఆఫ్‌ చేయాల్సి వస్తోంది. ఈ విధానంతో పంపులు, మోటార్లకు జరిగే నష్టానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్‌ నం.8 ద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పంపింగ్‌ పరిమిత సమయంలోనే జరిగే ప్రమాదం పొంచి ఉంది.

తద్వారా నీటి ఎత్తిపోతలు తగ్గి, కృష్ణా–గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పంపింగ్‌ సీజన్‌లో 24 గంటలు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలి. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. రైతు డిస్కమ్‌ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement