హరీశ్‌రావును అరెస్టు చేస్తున్న పోలీసులు. చిత్రంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు
సవాల్ విసిరిన జూపల్లి చర్చకు రాకుండా పారిపోయారు
బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
ఆరోపణలు నిరూపించలేని మంత్రి రాజీనామా చేయాలి
గురుకుల టెండర్లలో దాదాపు రూ.2 వేల కోట్ల అవినీతి జరిగింది
చేనేత కార్మికులకు, దళిత సంస్థలకు అన్యాయం చేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ విసిరిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు పోలీసులను అడ్డు పెట్టుకుని ముఖం చాటేసిందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరి, చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారన్నారు. అప్పులపై పూటకో లెక్క చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గురువారం గన్‌పార్క్ వద్దకు బయలుదేరిన హరీశ్‌ను అడ్డుకుని పోలీసులు కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, విడుదల అనంతరం తెలంగాణ భవ¯న్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణకు భవన్‌కు మంత్రులు రాకుండా ముఖం చాటేయడంతో గన్‌పార్కుకు వెళ్లే క్రమంలో పోలీసులు నన్ను అడ్డుకున్నారు. సవాలు విసిరి మాట నిలుపుకోలేక పోయిన మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే రాజీనామా చేయాలి. అప్పులపై అసెంబ్లీ వేదికగా వాస్తవ లెక్కలు చెప్పినా ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో తప్పుదోవ పట్టిస్తోంది’అని హరీశ్‌రావు విమర్శించారు.
భారీగా కమీషన్లు దండుకున్నారు..
‘గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన కిరాణా, యూనిఫాంలు, నోట్‌బుక్స్, ఇతర కొనుగోళ్ల టెండర్లలో దాదాపు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయి. కిరాణా సరుకులు, వంటనూనెలను అధిక ధరలకు కొనుగోలు చేసి కమీషన్లు దండుకున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కలి్పంచేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచి్చన జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. స్థాని కంగా ఇవ్వాల్సిన ఆర్డర్లను గుజరాత్‌కు చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. చేనేతల ప్రయోజనాలను కాపాడాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. లిడ్‌క్యాప్ ద్వారా జరగాల్సిన కొనుగోళ్లను నిలిపివేసి దళిత సంస్థలకు అన్యాయం చేశారు. నోట్‌బుక్స్ టెండర్లలో కమీషన్ల కోసమే నిబంధనలు మార్చారు. వివాదం బయటపడిన తర్వాత టెండర్లను రద్దు చేయడంతో ఇప్పటికీ విద్యార్థులకు నోట్‌బుక్స్ అందలేదు..’అని హరీశ్‌రా>వు ధ్వజమెత్తారు.
ప్రవీణ్‌కుమార్‌పై కక్షసాధింపు
‘గురుకుల టెండర్ల అక్రమాలను ఆధారాలతో ప్రశ్నిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. ఆయన భద్రతను తగ్గించడంతో పాటు, ఉద్యోగ విరమణకు చేరువలో ఉన్న ఆయన భార్యను ఆకస్మికంగా అప్రధాన ప్రాంతానికి బదిలీ చేశారు..’అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కమీషన్ల కుట్ర: ప్రవీణ్‌కుమార్
ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీలను రద్దు చేసి జీవో–17 ద్వారా సింగిల్ విండో విధానం తీసుకురావడం వెనుక కమీషన్ల కుట్ర జరిగింది. హైకోర్టును తప్పుదోవ పట్టించి కొద్ది కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంస్థలకు అవకాశాలు లేకుండా చేశారు. జీవో–17ను వెంటనే రద్దు చేసి, గురుకుల టెండర్లపై సమగ్ర విచారణ జరపాలి..’అని డిమాండ్ చేశారు.


