రంజాన్‌కు రెడీ! | Haleem bhatti preparation in Hyderabad ahead of Ramzan | Sakshi
Sakshi News home page

రంజాన్‌కు రెడీ!

Feb 13 2026 5:40 AM | Updated on Feb 13 2026 5:40 AM

Haleem bhatti preparation in Hyderabad ahead of Ramzan

హలీం బట్టీలను సిద్ధం చేస్తున్న హోటళ్ల నిర్వాహకులు

మసీదుల్లో ఏర్పాట్లు  పూర్తి 

ఫంక్షన్‌ ప్యాలెస్‌లు, మైదానాల్లో స్టాళ్ల ఏర్పాటు

ధరలు పెరిగే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: రంజాన్‌ ఉపవాస దీక్షలకు నగరంలోని ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న నెలవంక కనిపిస్తే 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించనున్నారు. నగర రంజాన్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఇక్కడి పసందైన వంటకాలకు మంచి పేరుంది. రంజాన్‌ మాసంలో పాతబస్తీలో ఆధ్యాత్మిక వాతావరణ ఉట్టిపడుతుంది. హలీం తయారీ ఏర్పాట్లు షురూ అయ్యాయి. హలీం తయారీలో కీలకమైన గోఠా, డెకీసాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఛత్తబజార్‌లో అన్వర్‌ తయారు చేసిన గోఠాలకు జిల్లాలు, ఇతర రాష్ట్రాలోనూ డిమాండ్‌ ఉంది.

అన్ని హోటళ్ల వద్ద నిర్వాహకులు హలీం బట్టీలను నిర్మిస్తున్నారు. ఫంక్షన్‌ ప్యాలెస్‌లు, మైదానాల్లో కూడా హలీం బట్టీలు ఏరాటు చేస్తున్నారు. హలీంలో గోధుమలు, మటన్, నెయ్యి, మసాలాలు కీలకం. అయితే ఈసారి కొంతమంది తయారుదారులు ఎక్కువ కొవ్వు లేకుండా ఆర్యోగానికి మేలు కలిగించే మిల్లెట్స్, వోట్స్, వెజిటెబుల్‌తో తయారు చేస్తున్నట్లు ఓ హోటల్‌ నిర్వాహకుడు తెలిపారు. ప్రొటీన్స్, తక్కువ మసాలాలతో ఆరేబియన్, యమనీ, సోమాలీ తదితర వెరైటీల్లో హలీం అందుబాటులోకి రానుంది.  

5 వేలకుపైగా విక్రయకేంద్రాలు  
నగరంలో 5 వేలకుపైగా హలీం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి నూనె, పప్పులు, మటన్, చికెన్‌తోపాటు మసాలాల ధరలు ఎక్కువగా ఉండటంతో హలీం ధరలు కూడా ఎక్కువగా ఉండే అవకాశముందని నిర్వాహకులు అంటున్నారు. గతంలో 280 వరకు ఉండగా ఈసారి ధర 320 వరకు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.

మసీదుల్లో ఏర్పాట్లు  
నమాజ్‌ల కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మసీదు కమిటీలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మసీదులకు సున్నాలు, కలర్‌ పెయింటింగ్‌ పూర్తి చేశారు. వజూఖానాల మరమ్మతులతోపాటు మంచినీటి సౌకార్యం కోసం కూలర్లు అమర్చుతున్నారు. మసీదు ప్రాంగణాల్లో షామియానాలు, రెకులòÙడ్లు అమర్చారు. ఇఫ్తార్‌ విందులకు ఇప్పటికే ప్రణాళికలు చేసుకొని రోజువారీ దాతల పేర్లు ఖరారు చేశారు. రాత్రి ఇషా నమాజ్‌ అనంతరం మసీదుల్లో తరావీ నమాజ్‌లు చేస్తారు. తరావీ నమాజ్‌లో హఫేజ్‌ (ఖురాన్‌ కంఠస్థం చేసినవారు) ఖురాన్‌ వినిపిస్తారు. అన్ని మసీదుల్లో హఫేజ్‌ల నియామకాలను మసీదు కమిటీలు పూర్తి చేసినట్లు జహారానగర్‌ మసీదు కమిటీ అధ్యక్షుడు మహ్మద్‌ బాకర్‌ సాహెబ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement