వార్నీ.. ఎయిర్‌పోర్టును కూడా వ‌ద‌ల‌రా! | GHMC officials campaign against garbage into the airport | Sakshi
Sakshi News home page

Begumpet Airport: ఎయిర్‌పోర్టులోకి చెత్త వేయొద్దు.. డప్పుతో దండోరా

Apr 10 2025 1:47 PM | Updated on Apr 10 2025 3:10 PM

GHMC officials campaign against garbage into the airport

మ‌నోళ్ల‌కు ఖాళీ స్థ‌లం క‌న‌బ‌డితే చాలు చెత్తంతా డంప్ చేసేస్తారు. ఇంటిలోని చెత్త‌నంతా మూట‌క‌ట్టి మ‌రీ ఖాళీ జాగాల్లోకి విసిరేస్తుంటారు. ఇక న‌గ‌రాల్లో అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. హైద‌రాబాద్‌లో ఎయిర్‌పోర్టును వ‌ద్ద‌ల్లేదీ 'చెత్త మ‌నుషులు'. బేగంపేట ఎయిర్‌పోర్టును ఆనుకుని ఉన్న కాల‌నీల నుంచి చెత్త ముంచెత్త‌డంతో బల్దియా అధికారులు రంగంలోకి దిగారు. ఎయిర్‌పోర్టులో చెత్త వేయొద్దంటూ దండోరా వేయించి మ‌రీ చెప్పారు.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ (Begumpet Airport) ప్రహరీని ఆనుకుని ఉన్న బస్తీ నివాసితులు తమ ఇళ్ల నుంచి వచ్చే చెత్తా చెదారం, ఇతరత్రా వ్యర్థాలను ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో వేయకుండా జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ వాహనాలకు అందించాలంటూ బుధవారం ఆయా బస్తీల్లో అవగాహన (Awareness) కలిగించారు.

ఎయిర్‌పోర్ట్‌ సమీప బస్తీలైన శ్యాంలాల్‌ బిల్డింగ్స్‌ తాతాచారి కాలనీ, భగత్‌సింగ్‌ నగర్‌ తదితర బస్తీలకు చెందిన ప్రజలు ఇళ్లలోని వ్యర్థాలను విమానాశ్రయ ప్రాంగణంలోకి వేస్తున్నారు. వీటిని తినడానికి వివిధ రకాల పక్షులు వస్తున్నాయి. ఈ క్రమంలో టేకాఫ్‌ అయ్యే, ల్యాండింగ్‌ అయ్యే క్రమంలో విమానాలకు ఇవి అడ్డుగా వస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణంలో చెత్త, వ్యర్థాలను పడేయడంతో కలుగుతున్న ఇబ్బందులను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు జీహెచ్‌ఎంసీ (GHMC) దృష్టికి తీసుకువచ్చారు.

చ‌దవండి: ఇక 15 నిమిషాల్లోనే ల్యాండ్ రిజిస్ట్రేష‌న్‌

ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ (Airport Authority) అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ బేగంపేట సర్కిల్‌ డీసీ డాకూ నాయక్, శానిటేషన్‌ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యర్థాలను విమానాశ్రయం ప్రాంగణంలోకి డంప్‌ చేయవద్దని ఇంటింటికి తిరిగి అవగాహన కలిగిచారు. అలాగే డప్పు చాటింపు వేయించారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ట్రాలీ ఆటోల్లోనే చెత్త వేయాలని సూచించారు. కార్యక్రమంలో శానిటేషన్‌ అధికారులు ఎస్‌ఎస్‌ ధనాగౌడ్, జవాన్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

డీఆర్‌ఎఫ్‌ బృందాలకు హైడ్రా కమిషనర్‌ కితాబు
హైద‌రాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేసిన డీఆర్‌ఎఫ్‌ బృందాలను హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ (AV Ranganath) అభినందించారు. బుధవారం హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, గత వారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో మూసీనదిలో చిక్కుకున్న ఇద్దరిని డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి.

బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో వీరిని అభినందించిన రంగనాథ్‌ ప్రమాదం ఎలా వస్తుందో తెలియదని, డీఆర్‌ఎఫ్‌ బృందాల అనునిత్యం అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లు చేసిన డీఆర్‌ఎఫ్‌ మార్షల్‌ ఫకృద్దీన్, సహాయక సిబ్బంది ఎ. రమేష్, ఎన్‌.శ్రీనివాస్, ఎండీ ఇమాముద్దీన్, కె.కార్తీక్‌ కుమార్‌లను రంగనాథ్‌ ప్రశంసించారు.  

Advertisement
 
Advertisement
Advertisement