
» నీకేం అవుతుందోనని భయమేస్తోంది
» రోజూ ఎన్‌కౌంటర్ అంటున్నారు..
» మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతికి అతడి తమ్ముని కూతురు లేఖ
కోరుట్ల: ‘పెదనాన్నా ఇంటికి రా... ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎన్‌కౌంటర్లు జరుగుతున్నయ్.. నువ్వెట్లున్నవో అని మాకు భయమేస్తోంది. సమసమాజం కోసం అడవులకు వెళ్లావు. ఇక చాలు.. ఇంటికి వచ్చేయ్’.. అని మావోయిస్టు అగ్రనేత, నంబాల కేశవరావు స్థానాన్ని భర్తీచేస్తారని భావిస్తున్న కోరుట్ల వాసి తిప్పిరి తిరుపతి తమ్ముడు గంగాధర్ కూతురు సుమ లేఖ రాసింది. బీటెక్ చదువుతున్న సుమ తన మనోభావాలను లేఖ ద్వారా బయటపెట్టింది.
నేను పుట్టక ముందే..
‘పెదనాన్నా.. నేను పుట్టకముందే సమసమాజ స్థాపన కోసం అడవుల బాట పట్టావు. నీ ప్రస్తావన వచి్చన ప్రతీసారి ఒకింత గర్వంగా ఉంటున్నా.. ఎంతో బాధగా ఉంటోంది. మీ ధైర్యం..ఆలోచన..పట్టుదల నన్ను ఎంతో ఆలోచింపజేస్తాయి. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు నాకు ఆ అవకాశం దక్కలేదు. మీ గురించి పత్రికల్లో వచ్చే వార్తలు చదివితే మీరు ఎంత గొప్పవారో అని గర్వంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనలు నన్ను కలవరపెడుతున్నాయి. మీకేం అవుతుందోనని మేం బెదిరిపోతున్నాం. మీరు ఇప్పటికే గెలిచారు.
ఇప్పుడు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి.. మీకు కుటుంబం ఉంది. దయచేసి వారిని మరవద్దు.. మీ కోసం వేచిచూస్తున్నాం. ఇక చాలు.. వచ్చేయండి పెదనాన్నా’అని అభ్యర్థించింది. కగార్ ఆపరేషన్ ఎవరిపై అన్న విషయం అర్థం కావడం లేదని పేర్కొంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి మనదేశంలో అమాయక పౌరులను చంపుతున్న వారిపై తీసుకుంటున్న చర్యలకన్నా.. మావోయిస్టులపై ఎక్కువ ఆపరేషన్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. మావోయిస్టులను దారుణంగా చంపి సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటారా..? అని లేఖలో సుమ పోలీసులను నిలదీసింది.