కమీషన్ల కోసమే సింగరేణిలో అమల్లోకి కొత్త నిబంధనలు
ప్రభుత్వ నిర్వాకం వల్లే 30 ఏళ్ల తర్వాత నష్టాలబాటలో సంస్థ
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
కొత్తగూడెం సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫర్లు మొదలు టెండర్ల వరకు అన్నింటా స్కాములే జరుగు తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా దాదాపు 30 ఏళ్ల తర్వా త సింగరేణి నష్టాలబాటలో నడుస్తోందని చెప్పారు. సింగరేణిలో కాంగ్రెస్ హయాంలో అన్ని విషయాల్లో స్కామ్‌లు జరుగుతున్నా యని, కమీషన్ల కోసం ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీశ్‌రావు పలు అంశాలపై మాట్లాడారు.
తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు
సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల లేని బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపుతూ ఆ మేరకు సెస్, ట్యాక్సులు, సీఎస్సార్, డీఎంఎఫ్‌టీ తదితర పన్నులు కట్టారని.. కానీ క్షేత్రస్థాయిలో అసలు బొగ్గును తవ్వి తీయలేదన్నారు. బొగ్గు నిల్వలు చూపించాలని తాము గనుల దగ్గరికి వెళ్తే అనుమతి ఇవ్వట్లేదని.. అదే సమయంలో పనికిరాని షెల్ బొగ్గును మట్టికుప్పలపై పోస్తూ అదే అసలైన బొగ్గుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై విచారణ చేపట్టి తప్పుడు వివరాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు హెచ్చరించారు. రెండేళ్ల క్రితమే ఉత్పత్తి నిలిచిపోయిన అడ్రియాల గనిలో 1.69 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొనడం కాంగ్రెస్ సర్కార్ అవినీతి పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
సీఎం బావమరిదికే లాభం
ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్ తొలగింపు పనుల్లో కమీషన్లు దండుకోవడం కోసమే సైట్ విజిట్ విధానం అమల్లోకి తెచ్చారని హరీశ్‌రావు ఆరోపించారు. సైట్ విజిట్ తెచ్చిన తర్వాత ప్రతిసారీ ఎక్సెస్‌కే టెండర్లు వెళ్తున్నాయని.. ఇలా ఎక్స్‌స్ టెండర్ దక్కించుకున్న తొలి కంపెనీ శోధా కన్‌స్ట్రక్షన్స్ ఓనర్ సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సైట్ విజిట్ నిబంధన అమల్లోకి వచ్చాక ఎక్సెస్ టెండర్ల వల్ల సింగరేణిపై రూ. 1,000 కోట్లకుపైగా అదనపు భారం పడిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి వివిధ బ్యాంకుల్లో సింగరేణికి రూ.3,200 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవని.. ప్రస్తుతం రూ. 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కి సింగరేణి వెళ్లిందని వివరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ, వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర, ఎమ్మెల్సీలు టి.రవీందర్‌రావు, తాతా మధు తదితరులు పాల్గొన్నారు.


