వీడియోకాల్‌లోనే బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ
హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల రిజిస్టర్డ్ బస్సుల దందా ఇది
ఈ తరహాలో పరుగులుపెడుతున్న 700కు పైగా బస్సులు
పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం... నిబంధనలు గాలికొదిలేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల్లో రోడ్ల మీద పరుగుపెడుతున్న వందల సంఖ్యలోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల నిర్వహణలో జరుగుతున్న ఓ చీకటి వ్యవహారం ఇప్పుడు వణుకుపుట్టిస్తోంది. ఒక్కో బస్సులో కనీసం 50 మంది చొప్పున ప్రయాణికులుంటారు. వారి ప్రాణాలు పూర్తిగా ఆ బస్సు పటుత్వం మీదనే ఆధారమై ఉంటుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న బస్సు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రధాన అంశాల్లో వాటి ఫిట్‌నెస్ లేమి అన్నది మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. అందుకే బస్సుల ఫిట్‌నెస్ అన్నది అత్యంత కీలకమైంది. అలాంటి కీలక విషయంలోనే భయంకర నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే బస్సుల ఫిట్‌నెస్‌ను ప్రత్యక్షంగా చూడకుండా ఏకంగా 2,800 కిలోమీటర్ల దూరం నుంచి వీడియోకాల్‌లో బస్సులను చూసి వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల రవాణాశాఖలు. మరోవైపు ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకుండా ఈ బస్సులు రోడ్లమీద పరుగులు పెడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గమనార్హం.
బస్సును చూడకుండానే..
హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 1,150 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలిస్తున్నాయి. విచిత్రమేంటంటే, వీటిల్లో కేవలం 128 బస్సులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నాయి. దాదాపు 750 బస్సులు హైదరాబాద్‌కు 2,800 కి.మీ.కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లాంటి రాష్ట్రాల పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు తమ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బస్సుల పర్మిట్ ఫీజు, రోడ్డు ట్యాక్స్, త్రైమాసిక పన్నులో భారీ రాయితీలను ప్రకటించాయి. దీంతో వాటి పరిధిలో రిజిస్ట్రేషన్ చేయిస్తే, ఒక్కో బస్సుపై సాలీనా రూ.8 లక్షల వరకు లబ్ధికలుగుతుంది. ఆ డబ్బులు మిగుల్చుకునే కక్కుర్తితో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తమ బస్సులను ఆయా దూరప్రాంత రాష్ట్రాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించి, హైదరా బాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాలు, పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల మధ్య తిప్పుతున్నారు. ఈ బస్సులు దూర ప్రాంత రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నందున, వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా ఆయా రాష్ట్రాల రవాణాశాఖలే జారీ చేయాలి. ఇక్కడే అసలు మతలబు చోటుచేసుకుంటోంది.
బస్సులను తీసుకెళ్లకుండానే...
ఎనిమిది సంవత్సరాల వరకు బస్సుకు ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్ చేయించాల్సి ఉంటుంది. బస్సు బ్రేకులు, గేర్లు, స్టీరింగ్, టైర్లు, ఇతర యంత్ర పరికరాలు సహా బస్సును ఆసాంతం పరీక్షించి బాగుంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులను ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి రవాణాశాఖ శాఖ అధికారుల ముందుంచితే వారు తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. బస్సు అక్కడికి వెళ్లి రావడానికి దాదాపు వారం రోజుల సమయం అవసరమవుతుంది. భారీ వ్యయం కూడా అవుతుంది. దీంతో బస్సులను అక్కడికి తీసుకెళ్లకుండానే ఆపరేటర్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నారు. కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారిద్వారా బస్సు నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేయించి, వీడియో కాల్ ద్వారా బస్సులను చూసి సర్టిఫికెట్లు జారీ చేసేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలేవీ?
ఇలా అడ్డదారిలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నారని రాష్ట్రప్రభుత్వానికి తెలిసి కూడా చర్యలు తీసుకోలేకపోతోంది. బస్సులను తనిఖీ చేయకుండా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేస్తున్నారని సంబంధిత ఈశాన్య రాష్ట్రాల రవాణాశాఖలను నిలదీయలేకపోతోంది. ఆ బస్సులు పేరుకు ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినప్పటికీ, వాటిల్లో తిరుగుతోంది మాత్రం తెలుగు రాష్ట్రాలవారేనన్న విషయాన్ని విస్మరిస్తోంది.
ఆ నిబంధన ఏమైనట్లు? ఏదీ కేంద్రం నిఘా?
పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిష్టర్ చేయించి వేరే ప్రాంతాల్లో ఆపరేటర్లు బస్సులు తిప్పుతున్నారన్న విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. బస్సు ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో ఆ రాష్ట్రం వెలుపల బస్సు 60 రోజులకు మించి ఉండకూడదన్నదే ఆ నిబంధన. అంటే ప్రతి 60 రోజులకు ఓమారు బస్సు కచ్చితంగా, రిజిస్టర్ అయిన రాష్ట్రంలోకి రావాల్సిందే. హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న బస్సులు ప్రతి రెండు నెలలకోమారు అంతదూరం వెళ్లి రావడం దాదాపు అసాధ్యం. దీంతో ఆ నిబంధన దర్జాగా బేఖాతరు అవుతోంది. కానీ, నిబంధన విధించిన కేంద్రం మాత్రం నిఘాను గాలికొదిలేసింది.
ఆ రోడ్లమీద ఎలా తిరుగుతాయి?
ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా కొండచరియలతో నిండి ఉంటాయి. కొన్ని మినహా అన్నీ ఘాట్ రోడ్లే. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 10–12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఇంత పొడవైన బస్సులు ఆ ఘాట్‌రోడ్లలో తిరగలేవు. మరి ఈ విషయం తెలిసి కూడా వాటిని ఆయా రాష్ట్రాల పరిధిలో తిరిగే బస్సులుగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఈశాన్య రాష్ట్రాల అధికారులకే తెలియాలి.


