ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికెలో ఎఫ్‌ఐఆర్‌ | An FIR will be filed in a jiffy, no matter what language complaint is made in | Sakshi
Sakshi News home page

ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికెలో ఎఫ్‌ఐఆర్‌

May 24 2026 5:04 AM | Updated on May 24 2026 5:04 AM

An FIR will be filed in a jiffy, no matter what language complaint is made in

ఫిర్యాదుల యాప్‌ను ఆవిష్కరిస్తున్న సీపీ సజ్జనర్‌

దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డర్‌ యాప్‌ అందుబాటులోకి 

బాధితులు మాతృభాషలో చేసే ఫిర్యాదులు తక్షణమే లిఖితపూర్వకంగా అనువాదం 

ఫిర్యాదు రికార్డ్‌ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్‌గా నిక్షిప్తం 

ఏఐ–కాప్‌రైటర్‌ యాప్‌ను ఆవిష్కరించిన హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలోని పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు ఫిర్యాదుల నమోదులో తలెత్తే భాషా సమస్యలను దూరం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ పోలీసులు ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డర్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ–కాప్‌రైటర్‌ పేరుతో ఉన్న ఈ యాప్‌ను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఆవిష్కరించారు. 

తక్షణమే రికార్డు చేసి అనువదిస్తూ... 
బాధితులు మాతృభాషలో చెప్పే ఫిర్యాదుల్లోని అంశాలను ఏఐ–కాప్‌రైటర్‌ తక్షణమే రికార్డు చేసి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు, పర్యాటకులకు ఫిర్యాదు చేసే సమయంలో ఎదురయ్యే భాషా సమస్యలను ఈ యాప్‌ తొలగిస్తుంది. బాధితుల భాష అర్థం కాకపోవడం వల్ల ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదు కావడానికి ఈ యాప్‌ స్వస్తి పలకనుంది. తొలిదశలో 10కిపైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను బ్లూక్లౌడ్‌ సాఫ్టెక్‌ సొల్యూషన్స్‌ సంస్థతోపాటు పాగ్రో చందు అనే ఇంటర్న్‌ సహకారంతో హైదరాబాద్‌ సిటీ పోలీసులు రూపొందించారు. 

యాప్‌లోని ప్రధాన అంశాలు 
బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో ఫిర్యాదు చేస్తే ఈ యాప్‌ వెంటనే పోలీసులకు అర్థమయ్యే భాషలోకి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. 
వేగం–కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు నమోదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. 
పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్‌ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్‌గా పీడీఎఫ్‌ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు. 
మల్టీ–పార్టీ లేబులింగ్‌: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్‌ చేస్తుంది. 

శిక్షలు కూడా పెరుగుతాయి 
హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీ కావడంతో తెలుగు, ఆంగ్లం, హిందీ రాని వాళ్లూ కూడా వలస వచ్చి స్థిరపడుతున్నారు. భాష తెలియకపోవడం వల్ల వచ్చే సమస్యలకు ఈ యాప్‌ చెక్‌ పెడుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మీకులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్‌ భారం తగ్గడమే కాకుండా రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది. పోలీసింగ్‌ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే తొలిసారిగా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణం. 
– వీసీ సజ్జనర్, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement