
బంజారాహిల్స్(హైదరాబాద్): మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను తీసుకెళుతున్న క్యాబ్‌ను ముగ్గురు ఆగంతకులు మద్యం మత్తులో దారికాసి అడ్డగించి బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో ఉంటున్న నలుగురు యువతులు కోకాపేటలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు విధులు ముగించుకుని సంస్థ కేటాయించిన క్యాబ్‌లో ఇంటికి బయలుదేరారు.
రోడ్డు నెంబర్–12 మీదుగా వీరు వెళ్తున్న కారును మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అడ్డగించి కారు అద్దాలను పగులగొట్టారు. కారు తాళాలు లాక్కున్నారు. తాము క్రిమినల్స్‌మని, అటాక్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం పోలీసులకు చెబితే అంతుచూస్తామని హెచ్చరించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితులు నేరుగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.