ఆరో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకులు సాధించిన అన్నదమ్ములు | Nalgonda Brothers Achieve Civil Services Success On Sixth Attempt, Know About Their Story Inside | Sakshi
Sakshi News home page

ఆరో ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకులు సాధించిన అన్నదమ్ములు

Mar 8 2026 12:29 PM | Updated on Mar 8 2026 3:54 PM

nalgonda brothers crack upsc in sixth attempt

నల్గొండ జిల్లా: సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో పట్టువదలని విక్రమార్కుల్లా కష్టపడిన ఇద్దరు అన్నదమ్ములు ఆరో ప్రయత్నంలో ర్యాంకులు సాధించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన వెలిమినేటి అలివేలు, అంజిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రమసింహారెడ్డి, కుమార్తె అర్చన ఉన్నారు. అంజిరెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా రిటైరయ్యారు. అలివేలు గృహిణి. వీరు పెద్ద చదువులు చదువుకోకపోయినా తమ పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు పిల్లల చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 

ఆరో ప్రయత్నంలో విజయం..
విజయసింహారెడ్డి, విక్రమసింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటిలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం వారు సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ క్రమంలో గతేడాది గ్రూప్‌–1 ఫలితాల్లో పెద్ద కుమారుడు విజయసింహారెడ్డి ఎంపీడీఓగా, చిన్న కుమారుడు విక్రమసింహారెడ్డి అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యారు. అయినప్పటికీ వారిద్దరు సివిల్స్‌ లక్ష్యాన్ని మరువలేదు. ఐదుసార్లు విఫలమైనప్పటికీ ఆరో ప్రయత్నంలో భాగంగా శుక్రవారం విడుదలైన ఫలితాల్లో విజయసింహారెడ్డి ఆలిండియా 642వ ర్యాంకు, విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు సాధించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సివిల్స్‌ ర్యాంకులు సాధించటం పట్ల వారి కుటుంబ సభ్యులతో పాటు సుంకెనపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాగా అంజిరెడ్డి కుమార్తె కుమార్తె అర్చన కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement