breaking news
women software engineer
-
మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ల క్యాబ్‌పై ఆగంతకుల దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకెళుతున్న క్యాబ్‌ను ముగ్గురు ఆగంతకులు మద్యం మత్తులో దారికాసి అడ్డగించి బెదిరించిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో ఉంటున్న నలుగురు యువతులు కోకాపేటలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరు విధులు ముగించుకుని సంస్థ కేటాయించిన క్యాబ్‌లో ఇంటికి బయలుదేరారు. రోడ్డు నెంబర్–12 మీదుగా వీరు వెళ్తున్న కారును మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అడ్డగించి కారు అద్దాలను పగులగొట్టారు. కారు తాళాలు లాక్కున్నారు. తాము క్రిమినల్స్మని, అటాక్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం పోలీసులకు చెబితే అంతుచూస్తామని హెచ్చరించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాధితులు నేరుగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
20 రోజుల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: 20 రోజుల కింద అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రోహిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆమె కోసం గత కొన్నిరోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. పుణెలో రోహిత ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కుటుంబ కలహాలతోనే రోహిత ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రంలోపు ఆమెను పోలీసులు హైదరాబాద్ తీసుకురానున్నారని, ఇక్కడికి తీసుకొచ్చాక కుటుంబ సభ్యులకు ఆమెను పోలీసులు అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే, రోహిత పుణె నుంచి రావడానికి ఇష్టపడటం లేదని, అక్కడ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమె తిరిగి హైదరాబాద్ రావాలనుకోవడం లేదని సమాచారం. హైదరాబాద్ నుంచి వెళ్లేముందు ఆమె తన ఏటీఎం కార్డు నుంచి రూ. 80వేలు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. చాదర్‌ఘాట్ ప్రాంతానికి చెందిన రోహిత నానక్‌రాంగూడలోని ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటోంది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మంత్రి సెలెప్టియా అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి ఉంటోంది. గత డిసెంబర్ 26న మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉండటంతో డిసెంబర్ 29న ఆమె సోదరుడు పరిక్షిత్ గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఐడీ కార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను ఫ్లాట్‌లోనే వదిలి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనుగొన్నారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని కోసం ముమ్మర గాలింపు -
మరో మహిళా టెకీ ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక వ్యధతో మూడురోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాణీ మనీషా ఉదంతం మర్చిపోకముందే హైదరాబాద్ నగరంలో మరో మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. నగరంలోని నలగండ్ల (చందానగర్)లో నివసిస్తోన్న మల్లీశ్వరి గచ్చిబౌలీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. కొన్నాళ్ల కిందట సునంద కుమార్ మోహిత్ అనే వ్యక్తితో పెళ్లయింది. వారికి ఒక బాబు కూడా ఉన్నాడు. కొద్దికాలంగా భర్త సునంద కుమార్ మల్లీశ్వరిని వేధించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు కుటుంబ పెద్దలకు ఫిర్యాదుచేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఆమె.. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్లాట్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న మల్లీశ్వరి బంధువులు ఫ్లాట్ల కు వెళ్లి పరిశీలించగా మృతురాలి మెడ, ముఖంపై గాయాలు కనిపించాయి. దీంతో భర్తే ఆమెను హత్యచేసి ఉంటాడని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.