కొడుకు మృతదేహంతో మూడురోజులు | Father Spent Three Days With Son Dead Body In Mancherial, More Details Inside | Sakshi
Sakshi News home page

కొడుకు మృతదేహంతో మూడురోజులు

Apr 30 2025 10:06 AM | Updated on Apr 30 2025 10:42 AM

Father spent three days Son dead body

చనిపోలేదని.. పడుకున్నాడని తండ్రి సమాధానం

మతిస్థిమితం లేని తండ్రి ఆస్పత్రికి తరలింపు 

మంచిర్యాల క్రైం: మతిస్థిమితం కోల్పోయిన ఒక తండ్రి.. చనిపోయిన కుమారుడి శవం పక్కనే మూ­డు రోజుల పాటు ఉన్న ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్‌రోడ్‌లో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, ఎస్‌ఐ ప్రవీణ్‌­కుమార్‌ తెలిపిన వివరాలివి. గూడెల్లి వెంకట్‌రెడ్డి అశోక్‌రోడ్డులో నివసిస్తున్నారు.

ఈయనకు కుమా­రుడు లక్ష్మీనారాయణ ఉన్నాడు. వెంకట్‌రెడ్డి సింగ­రేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మూడేళ్ల క్రితం భార్య రాధమ్మ అనారోగ్యంతో చనిపోయాక వెంకట్‌రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు. తండ్రీ­కొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. ఎస్టీపీపీలో కాంట్రాక్ట్‌ వర్కర్‌గా పనిచేస్తున్న కొడుకు లక్ష్మీనారా­యణ.. తండ్రి బాగోగులు చూసుకునేవారు. ఇటీ­వల మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ.. ఆది­వారం కూడా తాగి ఇంట్లోని సోఫాలో పడుకు­న్నా­రు. అప్పటి నుంచి బయటకు రాలేదు. 

మంగళ­వారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించ­గా.. సోఫాలో లక్ష్మీనారాయణ (30) శవమై కనిపించా­డు. మరోవైపు వెంకట్‌రెడ్డి అచేతన స్థితిలో పడు­కుని ఉన్నాడు. ‘నీ కొడుక్కి ఏమైంది..’ అని ప్రశ్ని­స్తే.. ‘పడుకున్నాడు’.. అంటూ సమాధానం చెప్పా­రు. పోలీసులు లక్ష్మీనారాయణ మృతదేహాన్ని ప్ర­భు­త్వ ఆసుపత్రికి తరలించి, వెంకట్‌రెడ్డిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వెంకట్‌రెడ్డి బంధువు గూడెల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement