కాల్మొక్త సారూ.. మా వడ్లు కొనండి | Farmers protest in Kummarikunt to buy grain | Sakshi
Sakshi News home page

కాల్మొక్త సారూ.. మా వడ్లు కొనండి

May 29 2025 12:22 AM | Updated on May 29 2025 12:22 AM

Farmers protest in Kummarikunt to buy grain

తహసీల్దార్‌ కాళ్లు మొక్కిన మహిళా రైతులు 

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటలో ఘటన 

ధాన్యం కొనుగోలు చేయాలని కుమ్మరికుంట్లలో రైతుల ధర్నా 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురుగు మందు డబ్బాలతో రైతుల ఆందోళన

నర్సింహులపేట/దంతాలపల్లి/కోనరావుపేట: వానాకాలం తరుముకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలున్న అన్నదాతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వారాలతరబడి వేచిచూస్తున్నా అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవటం, మరోవైపు రోజూ వర్షాలు పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో వడ్లకు కాంటా వేయాలని అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. బుధవారం మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యం కొనుగోలు చేయాలని ఇద్దరు గిరిజన మహిళా రైతులు తహసీల్దార్‌ రమేశ్‌బాబు కాళ్లు మొక్కి వేడుకున్నారు. 

తిర్మాతండాకు చెందిన భూక్య గోరి, భూక్య ఈరి అనే మహిళా రైతులు 40 రోజుల క్రితం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు అధికారులు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. అక్కడ మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసి కొనుగోలు కేంద్రం జలమయమైంది. దీంతో తహసీల్దార్‌ రమేశ్‌బాబు బుధవారం ఆ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు.

వర్షానికి వడ్లు తడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, వెంటనే కాంటా వేసి తరలించాలని వేడుకుంటూ ఆ రైతులు తహసీల్దార్‌ కాళ్లు మొక్కారు. ఇతర రైతులు ఆగ్రహంతో నిలదీయటంతో రెండు రోజుల్లో కాంటా వేసి ధాన్యం తరలిస్తామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు.  

ధాన్యం బస్తాలతో రోడ్డుపై నిరసన
ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో రైతులు బుధవారం ధాన్యం బస్తాలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోకపోవటంతో దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలు అడ్డుగా పెట్టి సుమారు 45 నిమిషాలు ధర్నా చేశారు. దీంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్‌పైగా వాహనాలు నిలిచిపోయాయి. 

అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు తమ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి 60 రోజులు అవుతోందని, ధర్నాను అడ్డుకోవద్దని పోలీసుల కాళ్లు పట్టుకోబోయాడు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతులు బుధవారం స్థానిక వై జంక్షన్‌ వద్ద పురుగులమందు డబ్బాలు పట్టుకుని తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. 

వెంకట్రావుపేట కేంద్రం పరిధిలో 10 వేల క్వింటాళ్లలోపే ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికే 8,300 క్వింటాళ్లు తూకం వేశామని సింగిల్‌విండో చైర్మన్‌ బండ నర్సయ్య చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే సింగిల్‌విండోను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement