వైద్య చికిత్స కోసం కమిషనర్ హరికిరణ్ చొరవ
నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలింపు..
ఖర్చులు భరిస్తామని హామీ ఆరా తీసిన మంత్రి జూపల్లి...
నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గంజాయి బ్యాచ్ కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి వైద్య చికిత్స పొందుతున్న నిజామాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ సౌమ్యకు ఎక్సైజ్ శాఖ అండగా నిలబడింది. నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ చొరవతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు ఆమెను కమిషనర్ హరికిరణ్ పరామర్శించారు.
ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇందుకయ్యే వైద్య ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని సౌమ్య కుటుంబ సభ్యులకు హరికిరణ్ హామీ ఇచ్చారు. శాఖాపరంగా తక్షణమే అందించాల్సిన సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న అడిషనల్ కమిషనర్ ఖురేషిని ఆదేశించారు.
ఎక్సైజ్ సిబ్బంది భద్రత పెంచేలా : జూపల్లి
కానిస్టేబుల్ సౌమ్యపై గంజాయి స్మగ్లర దాడి అత్యంత హేయమైన చర్య అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎక్సైజ్ సిబ్బందిపై జరిగే దాడులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని, అధికారులతో పాటు సిబ్బంది భద్రత, మనోధైర్యం పెంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి నిమ్స్ డైరెక్టర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి ఆమెకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు.
మెరు గైన వైద్యం అందించాలని సూచించారు. సౌమ్య త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సౌమ్యపై జరిగిన దాడి ఘటన గురించి కమిషనర్ హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసింలతో కూడా జూపల్లి మాట్లాడారు. పరారీలో ఉన్న నిందితులను తక్షణమే అరెస్టు చేసేలా పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.


