డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను రూట్‌ మళ్లించిన పోలీసులు | Deputy CM Bhatti Vikramarka diverted from scheduled route | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను రూట్‌ మళ్లించిన పోలీసులు

Jul 4 2026 8:10 AM | Updated on Jul 4 2026 9:05 AM

Deputy CM Bhatti Vikramarka diverted from scheduled route

సూర్యాపేట జిల్లా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోదాడ రూరల్‌ పోలీసులు షెడ్యూల్‌లో ఉన్న మార్గంలో కాకుండా మరో మార్గంలో తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. భట్టి విక్రమార్క బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో పార్టీ నాయకుడిని పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో అధికారులు కోదాడ మీదుగా వెళ్లేందుకు షెడ్యూల్‌ ఇచ్చారు. దీని ప్రకారం.. కోదాడ మీదుగా రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్‌ నుంచి ఏపీలోని చైర్‌మహ్మద్‌పేట నుంచి వల్లభి వెళ్లాల్సి ఉంది.

అయితే పోలీసులు కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్‌రోడ్‌ జంక్షన్‌ నుంచి ఖమ్మం వైపునకు కాన్వాయ్‌ను మళ్లించారు. అక్కడి నుంచి బొజ్జగూడెం స్టేజీ వద్దకు వెళ్లిన తర్వాత.. రూట్‌ ఇది కాదంటూ పోలీసులు మళ్లీ కాన్వాయ్‌ను వెనక్కి తిప్పి సరీ్వస్‌ రోడ్‌ మీదుగా బండపాలెం రోడ్‌ వద్దకు వెళ్లాక ఆ మార్గంలో వాగు ఉంది. దీంతోబండపాలెం మీదుగా చిమిర్యాల క్రాస్‌రోడ్‌ నుంచి రామాపురం క్రాస్‌రోడ్‌ దాటించొచ్చని ముందుకెళ్లారు. బండపాలెం నుంచి ముందుకు రోడ్‌ మార్గం లేకపోవడంతో భట్టివిక్రమార్క కోదాడ రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని పిలిచి ఎక్కడకు తీసుకెళ్తున్నావని మందలించారు. 

దీంతో అక్కడి నుంచి కాన్వాయ్‌ వెనక్కి మళ్లి కోదాడ–ఖమ్మం హైవే మీదుగా ముందుగా నిర్ణయించిన రూట్‌లోనే వల్లభికి వెళ్లారు. అయితే కోదాడ పోలీసుల తీరుపై భట్టివిక్రమార్క డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ విచారణ చేపట్టారు. కోదాడ రూరల్‌ ఎస్‌ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్టు శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రచారం సాగింది. ఈ ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ విచారణ చేశామని, శుక్రవారం ఉదయం కోదాడ రూరల్‌ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని తన కార్యాలయానికి పిలిపించి మందలించి పంపించానని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement