
కొనసాగుతున్న భూ సామర్థ్య పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న 5.4 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి ప్రస్తుతం భూ సామర్థ్య పరీక్షలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో అన్ని రకాల ప్రాథమిక పనులు పూర్తి చేసుకొని పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యం.
కారిడార్ మార్గంలో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ (Begumpet Air Port) వద్ద సుమారు 600 మీటర్ల దూరం నిర్మించనున్న టన్నెల్‌కు ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి లభించింది. ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. భూసేకరణ అయ్యే ఖర్చులతో కలిపి ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1550 కోట్లు అవుతుందని అంచనా.
కంటోన్మెంట్‌లో ప్రహరీ నిర్మాణం..
సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ ఔటర్‌రింగ్ రోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో రక్షణ శాఖకు చెందిన ప్రాంతంలో హెచ్‌ఎండీఏ ప్రహరీ నిర్మాణం చేపట్టింది. రక్షణశాఖ నుంచి దాదాపు 113.48 ఎకరాల భూమిని సేకరించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో చేపట్టనున్న కారిడార్ పనులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ గోడ ఒక సరిహద్దులా ఉపయోగపడనుంది. సుమారు 10 కి.మీ. వరకు ప్రహరీని నిర్మించే అవకాశం ఉంటుందని అధికారుల అంచనా.
కాగా.. రెండు భారీ మంచినీటి రిజర్వాయర్లను సైతం హెచ్‌ఎండీఏ నిర్మించి ఇవ్వనుంది. పనులు వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ మార్గంలోనూ హకీంపేట్ (Hakimpet) ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 500 మీటర్ల టన్నెల్ నిర్మించనున్నారు.
చదవండి: రాజీవ్ రహదారిలో ఖాళీ అవుతున్న దుకాణాలు
ఇది పూర్తిగా ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించనున్నప్పటికీ విమానాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సొరంగ మార్గం ఉంటుంది. దాదాపు రూ.2 వేల కోట్ల (పరిహారం చెల్లింపుతో సహా) నిర్మాణ అంచనాలతో ఈ కారిడార్‌కు హెచ్‌ఎండీఏ (HMDA) ప్రతిపాదనలు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.