
రాజీవ్ రహదారి మార్గంలో ఖాళీ అయిన దుకాణాలు
ఏడాదిన్నర క్రితం లివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఆస్తులు కోల్పోయేవారికి కొలిక్కిరాని పరిహారం
రాజీవ్ రహదారిలో ఖాళీ అవుతున్న దుకాణాలు
ఇదీ కంటోన్మెంట్‌లోని రెండు రోడ్ల విస్తరణ పరిస్థితి..
ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన.. నిర్మాణంలో జాప్యం.. ఎటూ తేలని భూసేకరణ, పరిహారం.. వేలాది మంది భవిష్యత్ అగమ్యగోచరం... ఇదీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో చేపట్టనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్‌ల పరిస్థితి. విస్తరించనున్నరెండు ప్రధాన రహదారుల్లో వందల సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో అటు పరిహారం తేలక, ఇటు అద్దెలు రాక యజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్మీకి భూములు, కంటోన్మెంట్‌కు పరిహారం..
రాజీవ్ రహదారి మార్గంలో ప్యాట్నీ నుంచి హకీంపేట (Hakimpet) వరకు, జాతీయ రహదారి–44 మార్గంలో ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వరకు ఆయా రోడ్లను 200 అడుగుల మేర ఎలివేటెడ్ కారిడార్లుగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 129 ఎకరాల రక్షణ భూములు, 24 ఎకరాల కంటోన్మెంట్, 110 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించాల్సి ఉంటుందని గుర్తించింది.
రక్షణ శాఖ భూములకు బదులుగా జవహర్‌నగర్ (Jawaharnagar) సమీపంలోని సుమారు 400 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూములను రక్షణ శాఖకు అప్పగించేందుకు ఒప్పందం కుదిరింది. 24 ఎకరాల కంటోన్మెంట్ భూములకు బదులుగా రూ.303 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే కంటోన్మెంట్ పరిధిలోని నాలాలు, భూగర్భ డ్రైనేజీల ఆధునీకరణకు వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలంటూ బోర్డు అధికారులు కేంద్రాన్ని కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తేలని ప్రైవేటు పరిహారం..
రాష్ట్ర రహదారి–1 (రాజీవ్ రహదారి) పరిధిలో 86 ఎకరాలు, జాతీయ రహదారి–44 మార్గంలో 24 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోల్పోయే ఆయా ఆస్తులకుగాను ప్రభుత్వ విలువకు కనీసం మూడు రెట్ల పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేటు భూములకు పరిహారంతోపాటు టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కింద అదనపు నిర్మాణ అనుమతులు లభిస్తాయి. కానీ, కంటోన్మెంట్‌లో ఈ వెసులుబాటు లేదు.
అద్దెలు కోల్పోతున్నాం
విస్తరించనున్న రోడ్డుకు ఆనుకుని ఉన్న భవనానికి వచ్చే అద్దెతోనే మా కుటుంబం జీవనం సాగిస్తోంది. అయితే మా భవనంలోని దుకాణాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. దీంతో నెలవారీ ఖర్చులకు కూడా ఇబ్బందిగా ఉంది. పరిహారంపై ఎటూ తేల్చకుండా సందిగ్ధంలో ఉంచడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం.
– సుబ్రహ్మణ్యం, వాసవి కాలనీ
చదవండి: ఓపెన్ ప్లాట్ల వేలం.. రూ. 100 కోట్ల ఆదాయం
విస్తరణను కుదించాలి
రోడ్డును 200 అడుగుల వెడల్పునకు విస్తరించడం వల్ల చుట్టుపక్కల ఉన్న భవనాల యజమానులకు నష్టం వాటిల్లుతోంది. కమర్షియల్ భవనాలు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. ఇంతకాలం వాటి అద్దెలతో జీవనం సాగించిన వారు రోడ్డున పడనున్నారు. వంద అడుగులకు రోడ్డు విస్తరణను కుదిస్తే చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. ఉప్పల్ భగాయత్ (Uppal Bhagayat) మాదిరిగా మాకు కూడా సమాన విలువ కలిగిన భూమిని పరిహారంగా ఇవ్వాలని కోరుతున్నాం.
– తేలుకుంట సతీష్ గుప్త, రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్ జేఏసీ చైర్మన్