ఈడనే ఉంటాం సారూ! | Elderly Couple Seeks Justice In Karimnagar Over Harassment By Sons After Property Division, More Details Inside | Sakshi
Sakshi News home page

ఈడనే ఉంటాం సారూ!

Jun 23 2026 10:43 AM | Updated on Jun 23 2026 10:53 AM

elderly couple seeks justice against sons at karimnagar prajavani

కొడుకులు తిండి పెడ్తలేరు.. అడుక్కోవాల్సిన దుస్థితి

ప్రజావాణిలో వృద్ధ దంపతుల ఆవేదన 

కరీంనగర్‌ అర్బన్‌: తమ కొడుకులు తాము బతికుండగానే నరకం చూపిస్తున్నారని వృద్ధ దంపతులు ప్రజావాణిని ఆశ్రయించారు. రెండేళ్ల క్రితం ఇలాగే ఫిర్యాదు చేస్తే అప్పటి ఆర్డీవో చర్యలు చేపట్టినా వారిలో మార్పు లేదని వాపోయారు. ‘సారూ.. మీరే న్యాయం చేయాలి.. లేకుంటే ఈడనే ఉంటాం’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. 

మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన వేనేంక కనకరాజు–అంజవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచి అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఉన్న ఆస్తిని పంచగా.. అప్పటి నుంచి కుమారులు తమపట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. రోగమొస్తే ఆసుపత్రికి తీసుకుపోవడం లేదని, సపర్యలు చేయడం లేదని, కనీసం తిండి కూడా పెట్టడం లేదని రోదించారు. 

తామిచ్చిన ఇంటిని తీసుకున్న కోడలు నానా రభస చేస్తోందని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. 2024లో ఇదే ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అప్పుడు ఒప్పందం రాశారని, కానీ పూర్తిగా పాటించడం లేదని వివరించారు. ఆస్తులు పంచడమే తాము చేసిన పాపమని తామిచ్చిన దాంట్లో 5.14 ఎకరాల భూమిని తమ పేరున మార్చాలని కలెక్టర్‌తో గోడు వెల్లబోసుకున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement