అక్కడక్కడా భూప్రకంపనలు | Earthquakes In Some Areas Of Telangana, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అక్కడక్కడా భూప్రకంపనలు

May 6 2025 5:54 AM | Updated on May 6 2025 10:38 AM

Earthquakes in Some Areas of Telangana

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జనం పరుగులు 

భీమారంలో కూలిన ఇంటి పైకప్పు

పులికంటలో భూకంప తీవ్రత 3.8గా రిక్టర్‌ స్కేల్‌పై నమోదు  

ఉమ్మడి ఆదిలాబాద్‌లో పలుచోట్ల...సిద్దిపేట జిల్లా రాజక్కపేట, దుబ్బాకలోనూ...

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. జగిత్యాల జిల్లాలో సుమారు మూడు సెకన్ల నుంచి ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. 

రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మూడు నుంచి నాలుగు సెకన్లు కంపించింది. ఇళ్లలోని వస్తువులు కింద పడడంతో ముందుగా ఉరుములతోనని అనుకున్న ప్రజలు.. భూకంపమని తెలుసుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జగిత్యాల జిల్లా భీమారం మండలంలో రాజుకు చెందిన పెంకుటిళ్లు పైకప్పు భూకంపం ధాటికి కూలిపోయింది. 

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం పులికుంట కేంద్రంగా సాయంత్రం 6.50 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 3.8గా నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని లక్ష్మణచాంద, పెంబి, ఖానాపూర్, దస్తూరాబాద్, జన్నారం, లక్సెట్టపేట, దండేపల్లి మండలాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. టేబుల్‌పై ఉన్న గ్లాసు కింద పడిందని జన్నారం మండలం పొనకల్‌ శ్రీలంక కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు జాడి రాజన్న తెలిపారు. తపాలపూర్‌లో అంట్ల స్టాండ్‌ నుంచి గ్లాసులు కింద పడినట్టు విజయధర్మ తెలిపారు.  

– సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటతోపాటు దుబ్బాక పట్టణంలో సాయంత్రం 6.45 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో స్వల్పంగా భూమి కంపించినట్టు గ్రామస్తులు తెలిపారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement