
ఇద్దరు యువకులను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీవ్రంగా కొట్టిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలివీ... జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని స్రవంతినగర్‌లో గంగోల శ్రీనివాసులు (29) అనే యువకుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీనివాసులు తనతో పనిచేస్తున్న కిరణ్, శ్రీనిజ, వెంకటేష్ , మహేష్, పవన్, సుభాష్ తదితరులతో కలిసి మూసాపేట చంద్రకళ థియేటర్‌లో కూలీ సినిమా చూసి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తిరిగి వెంకటగిరికి వచ్చి శ్రీనిజను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేశారు. అదే సమయంలో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చి మద్యం మత్తులో తూలుతూ శ్రీనివాసులును ఉద్దేశించి అరేయ్.. మీరంతా ఎవర్రా.. నా చెల్లిని తీసుకుపోవడానికి మీరెవరు..అంటూ కొట్టాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. అడ్డుకోవడానికి యతి్నంచిన శ్రీనివాసులు స్నేహితుడిని కూడా కొట్టారు.
నువ్వు కారు ఎక్కు.. నీతో పని ఉంది అంటూ బలవంతంగా కారు ఎక్కించుకుని 10 నిమిషాల పాటు హైలంకాలనీ ఏరియాలో తిప్పారు. ఓ వైన్ షాపు ముందు ఆపి తమతో పాటు తెచ్చుకున్న బీర్లు తాగుతూ రేవంత్‌తో పాటు ఆయన స్నేహితుడు విశాల్.. శ్రీనివాసులును తీవ్రంగా కొట్టారు. అడ్డువచ్చిన కిరణ్‌ను కూడా తీవ్రంగా బాదారు. మళ్లీ కారు ఎక్కించుకుని శ్రీనివాసులుతో పాటు ఆయన స్నేహితుడు కిరణ్‌ను మళ్లీ యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ వైపు తీసుకువెళ్లారు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసు వాహనం అటువైపు రావడంతో వీరిద్దరూ బిగ్గరగా అరిచి పోలీసులను అప్రమత్తం చేశారు. స్పందించిన పోలీసులు కారును ఆపి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వీరిద్దరికీ డ్రంకన్ డ్రైవ్ నిర్వహించగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు నిర్థారణ అయ్యింది. దర్యాప్తులో నిందితుడు తొక్కుడుబియ్యపు రేవంత్ (27) యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో నివసిస్తుంటాడని, తండ్రి పోలీసు చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ఆయనకు చాంద్రాయణగుట్ట బ్రాంచ్ పింఛన్ ఆఫీసులో సబార్డినేట్ పోస్టు వచి్చనట్లు తేలింది. ఆయన స్నేహితుడు నారగాని విశాల్ శ్రీనగర్‌కాలనీలో నివసిస్తుండగా ఓ కారు షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. వీరి అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.