వైద్యులకు స్టైపెండ్‌ అందడం లేదు! | Doctors are not getting stipend | Sakshi
Sakshi News home page

వైద్యులకు స్టైపెండ్‌ అందడం లేదు!

Published Wed, Oct 25 2023 1:41 AM | Last Updated on Wed, Oct 25 2023 1:41 AM

Doctors are not getting stipend - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌లకు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ ఇవ్వడం లేదని తేలింది. ఈ సమస్యపై జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆధ్వర్యంలో గూగుల్‌ ఫాం ద్వారా ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది.

మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎన్‌ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా 70 శాతం మంది యూజీ ఇంటర్న్‌లకు, పీజీ విద్యార్థులకు స్టైపెండ్‌ అందడం లేదని తేలింది. దీంతో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని స్టైఫండ్‌ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

10,178 మందితో ఆన్‌లైన్‌ సర్వే...
ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌లు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ చెల్లించే సమస్యపై గూగుల్‌ ఫాం ద్వారా ఆన్‌లైన్‌ సర్వే జరిగింది. పీజీ విద్యార్థుల నుంచి మొత్తం 10,178 మంది నుంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. అందులో 7,901 మంది వివరాలను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలోని 213 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల నుంచి ఫీడ్‌బ్యాక్‌ స్వీకరించారు. అందులో 2,110 మంది పీజీ విద్యార్థులు తమకు స్టైపెండ్‌ అందడం లేదని స్పష్టం చేశారు.

4,288 మంది విద్యార్థులు తమకు చెల్లించే స్టైపెండ్‌ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు చెల్లిస్తున్న స్టైపెండ్‌తో సమానంగా ఉండటం లేదని వెల్లడించారు. తమకు వచ్చే స్టైపెండ్‌ను ఆయా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలే వెనక్కు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అనేక కాలేజీలు కాగితాలపై మాత్రం విద్యార్థులకు స్టైపెండ్‌ ఇస్తున్నట్లు రాసుకుంటున్నాయి. కానీ వాస్తవంగా వారికి ఒక్క పైసా ఇవ్వడంలేదు. 

ఆందోళనలకు సిద్ధమవుతున్న జూ.డాక్టర్లు...
తెలంగాణలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని జూనియర్‌ డాక్టర్లు స్టైపెండ్‌ చెల్లింపులో జాప్యంపై సమ్మెకు సిద్ధమవుతున్నారు. మెజారిటీ ప్రైవేట్‌ కాలేజీలు స్టైపెండ్‌లు చెల్లించడం లేదని, ఈ సమస్యపై ఎన్‌ఎంసీని ఆశ్రయించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్‌ కాలేజీల విద్యా ర్థులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారు యూనియన్లు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యాలు సహించడంలేదు.

గత్యంతరం లేక అప్పులు చేయాల్సి వస్తుందని హైదరా బాద్‌లోని ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన ఒక జూనియర్‌ డాక్టర్‌ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టైపెండ్‌ వచ్చేలా ఆందోళనలు చేస్తామని కొందరు విద్యార్థులు అంటున్నారు. కాగా, వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌చెల్లించక పోవడంపై వైద్యవిద్య అధికారులను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికా రులు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement