బాల్యంలోనే పెళ్లి, 20 ఏళ్ల వయస్సులోనే బిడ్డకు తండ్రి. అయితేనేం కష్టపడి చదివి, సవాళ్లు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయలేదు. అనుకున్నది సాధించే దాకా నిద్ర పోలేదు. రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన రామ్‌లాల్ నీట్‌లో విజయం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. రామ్‌లాల్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని ఒక చిన్న జిల్లాకు చెందిన వాడు రామ్‌లాల్. ఎన్నో కష్టాలకోర్చి తన కలను సాకారం చేసుకున్నాడు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, తన వైద్య ప్రయాణానికి మార్గం సుగమం చేసుకున్నాడు.
అయితే రామ్‌లాల్‌కి 6వ తరగతి చదువుతున్నప్పుడే పెళ్లి అయిపోయింది. పెళ్లి, సంసారం, బాధ్యతలు వీటిపై ఎలాంటి అవగాహన లేని సమయంలోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకునే సమయంలో 11 ఏళ్లకే ఒక ఇంటి వాడైపోయాడు. తల్లిదండ్రులు నిశ్చయం.. పైగా చిన్న వయసు. ఎటూ ప్రశ్నించలేని తనం. తలొగ్గడం తప్పడం చేయ గలిగిందేమీ లేదు.
అందుకే, పాత విషయాలను పక్కనపెట్టి, రామ్‌లాల్ తన చదువును కొనసాగిస్తూనే, తన ఫ్యూచర్ ప్లాన్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. తన కలను కుటుంబం ముందు ఉంచాడు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. అదృష్టం ఏమిటంటే చదువు విలువు తెలిసిన రామ్‌లాల్ భార్య , భర్త ఆశయాలను అర్థం చేసుకుంది. అతనికి అండగా నిలబడింది. ఆమె మద్దతు ,ప్రోత్సాహం లేకపోయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.
10వ తరగతిలో రామ్‌లాల్ 74 శాతం మార్కులు సాధించి, త్వరలోనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే అంతిమ లక్ష్యంతో సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నెలల తరబడి సన్నద్ధమైన తర్వాత, 2019లో నీట్ పరీక్షకు హాజరై, 720 మార్కులకు కేవలం 350 మార్కులు మాత్రమే సాధించాడు. అయినా నిరాశపడలేదు. తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో కోచింగ్ సంస్థలో చేరాడు.2022లో మరోసారి నీట్ రాశాడు.మునుపటి కంటే మెరుగ్గా 490 మార్కులు సాధించాడు,. ప్రతీ ప్రయత్నం, వైఫల్యం అతనిలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. మరింత కష్టపడాలనే సంకల్పం పెరిగింది. దాంతో అతను మంచి ర్యాంకు సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు. చివరికి ఐదు ప్రయత్నాల తర్వాత 2023లోమంచి ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 2023లోనే రామ్‌లాల్‌కు ఒక పాపపుట్టడం విశేషం.
ఎవరు వ్యతిరేకించినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా సాధించాలనే సంకల్పం, పట్టుదల ఉంటే విజేతలుగా నిలవడంలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు అనడానికి రామ్‌లాల్ ప్రయాణమే నిదర్శనం.


