పంపా: కేరళలోని పంపా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వెలుగు చూసింది. నెడుంబస్సేరికి చెందిన 55 ఏళ్ల ప్రీతా బాలచంద్రన్ అనే మహిళా భక్తురాలి కాలికి కట్టు కట్టిన బ్యాండేజీలో సర్జికల్ బ్లేడ్ ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితురాలు పథనంతిట్ట జిల్లా మెడికల్ ఆఫీసర్ (డీఎంఓ)కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం ఇది పూర్తిగా వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యమేనని ఆమె ఆరోపించారు.
జనవరి 12 నుంచి పందళం నుండి తిరువాభరణ ఊరేగింపుతో పాటు పాదయాత్రలో పాల్గొన్న ప్రీతా, ఎక్కువ దూరం నడవడంతో కాళ్లకు బొబ్బలు వచ్చాయి. జనవరి 15 తెల్లవారుజామున ఆమె పంపా ఆసుపత్రికి వెళ్లారు. ఆ రోజు జరిగిన ఘటన గురించి ప్రీతా మాట్లాడుతూ అక్కడ అర్హత కలిగిన నర్సులు ఎవరూ విధుల్లో లేరని, సిబ్బంది అంతా నిద్రిస్తున్నారని, లుంగీ, చొక్కా ధరించిన ఒక నర్సింగ్ అసిస్టెంట్ తనకు చికిత్స చేశారని, ఆ సమయంలో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆమె వాపోయారు.
నర్సింగ్ అసిస్టెంట్ తన గాయంపై సూదితో లోతుగా గుచ్చాడని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని ప్రీతా పేర్కొన్నారు. గాయంలోని ద్రవాన్ని తీయాలని చెబుతూ అతను సర్జికల్ బ్లేడ్ చేతిలోకి తీసుకున్నప్పుడు, అతని తీరు చూసి భయపడి తాను చికిత్సను ఆపించేశానని చెప్పారు. కట్టు కడితే చాలని తాను కోరినప్పటికీ, సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరించడంతో ఆ బ్లేడ్ పొరపాటున బ్యాండేజీ లోపలే ఉండిపోయిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో భక్తులు వచ్చే పంపాలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటికి చేరుకున్న తర్వాత, ఆమె తనకున్న మధుమేహం కారణంగా గాయాన్ని జాగ్రత్తగా శుభ్రం చేసుకుందామని బ్యాండేజీ విప్పగా, అందులో మెరుస్తున్న పదునైన సర్జికల్ బ్లేడ్ బయటపడింది. వెంటనే ఆమె పథనంతిట్ట డీఎంఓకు ఫిర్యాదు చేశారు. డీఎంఓ కార్యాలయం నుండి అధికారులు ఆమెను సంప్రదించి వివరాలు సేకరించినట్లు ప్రీతా తెలిపారు. మండలం-మకరవిళక్కు సీజన్‌లో భక్తులకు అందుతున్న వైద్య సేవలపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇది కూడా చదవండి: ‘అందుకే అఘాయిత్యాలు..’ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు


