భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరైయా అత్యాచార ఘటనలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భాండేర్ నియోజకవర్గానికి చెందిన ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అత్యాచారాలను కులం, మతపరమైన నమ్మకాలతో ముడిపెట్టారు. ‘రోడ్డుపై వెళ్లేటప్పుడు అందమైన అమ్మాయి కనిపిస్తే, మగవారి మనసు చలిస్తుంది. అంటూనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన గ్రంథాల కారణంగానే ఇలా జరుగుతోందని అన్నారు. పసిపిల్లలపై జరిగే హేయమైన నేరాలను కూడా సమర్థిస్తున్నట్లు మాట్లాడారు.
ఎమ్మెల్యే బరైయా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పార్టీకి వాటితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అత్యాచారం అనేది క్షమించరాని నేరం. దీనిని కులం లేదా మతంతో ముడిపెట్టడం సరికాదు. నేరస్తులను సమర్థించేలా ఎవరు మాట్లాడినా ఆమోదయోగ్యం కాదు’ అని పట్వారీ స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన బరైయాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళలను వక్ర దృష్టితో చూడటం, దళిత, గిరిజన మహిళలపై జరిగే దాడులను పవిత్ర కార్యాలుగా వర్ణించడం ఎమ్మెల్యే వికృత మనస్తత్వానికి నిదర్శనమని మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్-ఛార్జ్ ఆశిష్ అగర్వాల్ ధ్వజమెత్తారు. మహిళలను దేవతలా పూజించే దేశంలో.. వారిని ఆట వస్తువులుగా చూడటం కాంగ్రెస్ భావజాలమా?" అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ రక్షణ పేరుతో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని, లేదా బరైయాను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
పూల్ సింగ్ బరైయా నోరు పారేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. ఆయన గతంలోనూ అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2026 జనవరిలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల పరిస్థితిని కుక్కలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. అలాగే 2024 అక్టోబర్‌లో ఎన్నికల అధికారులను బెదిరించడం, 2020లో అగ్రవర్ణాలను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తదితర అంశాలు ఆయన ట్రాక్ రికార్డులో ఉన్నాయి. తాజా వ్యాఖ్యలతో మరోసారి ఆయన విమర్శల పాలయ్యారు.
ఇది కూడా చదవండి: ప్రముఖ సింగర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ డెత్ వార్నింగ్


