ప్రముఖ సింగర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ డెత్ వార్నింగ్ | Bishnoi gang demands Rs 10 crore extortion from singer B Praak | Sakshi
Sakshi News home page

ప్రముఖ సింగర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ డెత్ వార్నింగ్

Jan 17 2026 11:55 AM | Updated on Jan 17 2026 12:08 PM

Bishnoi gang demands Rs 10 crore extortion from singer B Praak

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, పంజాబీ గాయకుడు బి ప్రాక్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి  బెదిరింపులు అందాయి. వారంల్లోగా రూ. 10 కోట్లు ఇవ్వకపోతే దారుణమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ గ్యాంగ్ హెచ్చరించింది. బి ప్రాక్ సహోద్యోగి, గాయని దిల్నూర్ మొబైల్‌కు ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల ద్వారా ఈ బెదిరింపులు అందాయి. ఇది బాలీవుడ్ వర్గాల్లో భయాందోళనలు రేకెత్తించింది.

వివరాల్లోకి వెళితే జనవరి 5న  దిల్నూర్ మొబైల్‌కు అంతర్జాతీయ నంబర్ నుంచి రెండు సార్లు ఫోన్ కాల్స్ రాగా ఆమె స్పందించలేదు. మర్నాడు మధ్యాహ్నం మళ్లీ కాల్ రావడంతో అనుమానం రావడంతో ఆమె కట్ చేశారు. ఆ వెంటనే జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అర్జు బిష్ణోయ్ పేరుతో ఆమెకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ‘హలో.. నేను అర్జు బిష్ణోయ్‌ని మాట్లాడుతున్నా.. బి ప్రాక్‌కు చెప్పు.. మాకు రూ. 10 కోట్లు కావాలి. మీకు వారం రోజులు గడువు ఇస్తున్నాం. మీరు ఏ దేశానికి పారిపోయినా సరే, అతనితోపాటు ఉండే ఎవరినికూడా వదిలిపెట్టం. దీన్ని ఫేక్ అని భావించవద్దు. డబ్బు ఇవ్వకపోతే అతన్ని మట్టిలో కలిపేస్తాం’ అని ఆ ఆడియోలో స్పష్టంగా హెచ్చరించారు.
 

ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన దిల్నూర్, జనవరి 6వ తేదీనే మొహాలీ ఎస్ఎస్‌పీ (ఎస్‌ఎస్‌పీ) కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్, వాయిస్ మెసేజ్‌లను ఆమె పోలీసులకు సమర్పించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ ఎక్స్‌టార్షన్ (వసూళ్ల) కేసుగా పరిగణించిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, బాధితులకు తగిన రక్షణ  కల్పిస్తామని అధికారులు తెలిపారు.

బిష్ణోయ్ గ్యాంగ్  మొన్నటి జనవరి ఒకటిన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఒక వ్యాపారి ఇంటి బయట సాయంత్రం సుమారు 25 రౌండ్ల కాల్పులు జరిపి భీభత్సం సృష్టించింది. అలాగే పశ్చిమ విహార్‌లోని జిమ్,  తూర్పు ఢిల్లీ వ్యాపారిపై కూడా ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ చేసి కాల్పులకు తెగబడింది. ఢిల్లీ పోలీసులు తమ ఎన్‌కౌంటర్లతో గ్యాంగ్‌లోని కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ గ్యంగ్‌ బి ప్రాక్ వంటి హై-ప్రొఫైల్ సెలబ్రిటీని టార్గెట్ చేయడం  కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: ముంబై ఫలితాలు.. శివసేనపై కత్తి దూసిన కంగనా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement