ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలపై హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు. 2020లో అవిభక్త శివసేన అధికారంలో ఉన్నప్పుడు బాంద్రా వెస్ట్‌లోని తన బంగ్లాను బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన ఘటనను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాడు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన ‘మహిళా ద్వేషులు, రౌడీలు, నెపోటిజం మాఫియా’కు ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పారని కంగనా వ్యాఖ్యానించారు.
ముంబైలో శివసేన (ఠాక్రే వర్గం) ప్రాబల్యం తగ్గి, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంపై కంగనా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనవిజయానికి కారకులైన ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘నన్ను దూషించి, నా ఇల్లు కూల్చివేసి, మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని రాష్ట్ర ప్రజలే బహిష్కరించారు. అహంకారులు, మహిళా వ్యతిరేకులకు ‘జనతా జనార్దనులే’ వారి స్థానం ఏమిటో చూపించారు’ అని కంగనా ఘాటుగా విమర్శించారు.
గతంలో ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని కంగనా రనౌత్ కార్యాలయంలో కొంత భాగాన్ని నిబంధనల పేరుతో బీఎంసీ కూల్చివేసింది. దీనిపై కంగనా.. బాంబే హైకోర్టును ఆశ్రయించగా, నాడు న్యాయస్థానం బీఎంసీ చర్యను తప్పుబడుతూ, అది పూర్తిగా దురుద్దేశంతో కూడినదని స్పష్టం చేసింది. ముంబై పోలీసులపై, ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యల కారణంగానే నాడు బీఎంసీ కక్షపూరితంగా వ్యవహరించిందని కంగనా ఆరోపించారు. నాటి అవమానానికి ఈనాటి ఎన్నికల ఫలితాలే సరైన సమాధానమని ఆమె అన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఎన్నికల్లో బీజేపీ 11,79,273 ఓట్లతో (21.58 శాతం) ఏకంగా 89 స్థానాలను కైవసం చేసుకుని బీఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల విజయం సాధించింది. ముంబైతో పాటు పూణే, పింప్రి-చించ్వాడ్, థానే, నాసిక్, నవీ ముంబై వంటి కీలక నగరాల్లోనూ బీజేపీ విజయపతాకం ఎగురవేసింది.
ఇది కూడా చదవండి:అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు


