
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కి చేరింది. పటాన్ చెరువులోని ధృవ ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు చికిత్స పొందుతూ ఇవాళ మరో కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగి దుర్ఘటనలో క్షతగాత్రులైన వారు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు.
తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం కార్మికుడు భీంరావు మృతి చెందగా, శనివారం మరో కార్మికుడు మున్‌మున్‌చౌదరి మృత్యువాత పడ్డారు. ఇవాళ(ఆదివారం) మరో కార్మికుడు మరణించాడు. ఇవాళ మరో మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఆచూకీ లేని తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించడం లేదు. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య 43కి చేరింది.
ఆ రెండు మృతదేహాలు ఎవరివి?
పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో రెండు ఫుల్ డెడ్‌బాడీలు ఉన్నాయి. ఈ మృతదేహాలు ఎవరివనేది తేలడం లేదు. అవి ఆయా కుటుంబసభ్యుల డీఎన్‌ఏలతో సరిపోవడం లేదు. దీంతో ఆయా కుటుంబాల్లోని ఇతర సభ్యుల రక్తం శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన వారివి కాకుండా ఆ కుటుంబంలోని మరొకరి రక్తం శాంపిల్‌ను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ నివేదికలు వచ్చాకే ఈ రెండు ఫుల్ డెడ్‌బాడీలను సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చిన మూడు డెడ్‌బాడీలను శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభ్యం
శనివారం శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభించాయి. ఎముకలు, చేతివేళ్లు, ఇతర శరీరభాగాలు లభించడంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికే 15 శరీరభాగాలు మార్చురీలో ఉన్నాయి. వీటి డీఎన్‌ఏ రిపోర్టులు వచి్చ నా, అవి శాంపిల్స్ ఇచ్చిన వారి కుటుంబాలకు సరిపోవడం లేదు.
కొనసాగుతున్న రెస్క్యూ
పేలుడు జరిగిన స్థలంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా అధికారుల రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం కూడా కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయ్యింది. కానీ పేలుడు తీవ్రతకు భూమిలోకి దంతాలు, ఎముకలు వంటి శరీరభాగాలు ఏమైనా చొచ్చుకుని పోయాయా? మరేదైనా ఆనవాళ్లు లభిస్తాయోనని ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా అధికారులు పంట చేలో కలుపు తీసిన మాదిరిగా ఆనవాళ్ల కోసం చేతులతో తవ్వుతున్నారు.