మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌లో వస్తున్న బెదిరింపులు, దుర్భాషలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ హామీ ఇచ్చారు. స్వతంత్ర జర్నలిస్టు తులసి చందు సహా పలువురు మహిళా జర్నలిస్టులు మంగళవారం కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. తమపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడులకు సంబంధించిన వివరాలను వారు అందించారు.
సోషల్‌మీడియాలో నిరంతరం విద్వేష వ్యాఖ్యలు,అసభ్య పోస్టులు, దాడులు, హత్యా బెదిరింపులకు పాల్పడుతున్న వైనంపై మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. ఈ వేధింపుల నియంత్రణకు కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సజ్జనార్‌కు విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్‌కు సంబంధించిన వీడియోలను ఆయన పరిశీలించారు.తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు అందుబాటులో ఉన్న లింకులు, స్క్రీన్‌షాట్లు, వీడియోలను తన కార్యాలయానికి ఇవ్వాలని సజ్జనార్ కోరారు.
కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద
ఆన్‌లైన్ వేధింపులపై పోరాటంలో భాగంగా మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం మహిళా కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా స్పందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామన్నారు.


