
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతేడాది మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో భాగంగా ఐదు నెలల జైలు శిక్ష అనంతరం కవితకు షరతులమీద బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్‌పోర్టును రౌస్ అవెన్యూ కోర్టులో అందించారు.
తాజాగా, గ్రాడ్యుయేషన్ నిమిత్తం తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పాస్‌పోర్టును విడుదల చేసింది. దీంతో కవిత ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. 15రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
ఇక అమెరికా పర్యటనకు ముందు కవిత..తన తండ్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు కవితతో పాటు చిన్న కుమారుడు ఆర్య సైతం వెళ్లనున్నారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం, శనివారం ఉదయం అమెరికాకు బయల్దేరనున్నారు.