నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి తెర
ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ
స్వయంగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. 3 విడతల్లో 6 రోజులపాటు ప్రచారం
డివిజన్ల వారీగా బస్తీల్లో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొని ప్రజావ్యతిరేకతను చాటాలని బీఆర్‌ఎస్ తహతహ
గుంభనంగా ఓటరు.. పోలింగ్ సమీపిస్తున్నా బయటపడని మనోగతం
ఓటరు తీర్పు ప్రజాపాలన లేదా ప్రజావ్యతిరేకతకు రెఫరెండం అంటున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
అయితే విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజానాడి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో తమ మనోగతాన్ని వెల్లడించేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు లేదా బీఆర్‌ఎస్‌ను ప్రజలు మళ్లీ ఆదరిస్తే ఆ పార్టీ చెబుతున్న ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రచార బరిలోకి సీఎం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టేయడం ఈ ఉపఎన్నిక తీవ్రతకు అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలు అప్పగించడం, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలంతా ఇంటింటి ప్రచారంలో తలమునకలవడం చూస్తే ఈ గెలుపును కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో తెలుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే హైడ్రా చేపట్టిన పేదలు, సామాన్యుల ఇళ్ల కూల్చివేతలు, ఆరు గ్యారంటీల అమల్లో అక్కడక్కడా తలెత్తిన లోపాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడం ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రియల్టీ రంగం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని, ప్రభుత్వ బడ్జెట్ పరిమితుల దృష్యా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరగలేదని వారు చెబుతున్నారు.
అందుకు తగ్గట్టే ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ విపక్ష బీఆర్‌ఎస్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికులకు కొన్నేళ్లుగా చిరపరిమితుడు కావడం.. గతంలోనూ పోటీ చేసి ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. అలాగే సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం, మజ్లిస్ మద్దతిస్తుండటం ఆ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజావ్యతిరేకత చాటాలని బీఆర్‌ఎస్..
సిట్టింగ్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో విపక్ష బీఆర్‌ఎస్ ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా ప్రజావ్యతిరేకతను గట్టిగా చాటేందుకు ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోందని చెబుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల కేసీఆర్ పాలనతో పోలుస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ ప్రచారంలో అధిక ప్రాధాన్యం ఇస్తోందని వారు వివరిస్తున్నారు.
ప్రత్యేకించి హైదరాబాద్‌ను తాము చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారంలో పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నగరం నలుమూలలా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వడం, బీఆర్‌ఎస్ హయాంలో సాగిన 42 ఫ్లైఓవర్ల నిర్మాణం, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచిత తాగునీరు ఇవ్వడం, ఆ పార్టీ హయాంలో ఐటీ సంస్థలకు ఇచ్చిన తోడ్పాటు వంటి అంశాలు బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలో కలిసి వచ్చే అంశాలు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన సతీమణి బరిలో నిలవడం కూడా బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలో దోహదపడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
బీజేపీ సైతం ఆశల పల్లకీలో..
ఇక బీజేపీ సైతం ఉపఎన్నికలో సత్తా చాటేందుకు ప్రచారంలో వేగం పెంచింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రచారపర్వాన్ని బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటేనని.. ఆ పార్టీలను గెలిపించొద్దని కోరుతున్నారు. ప్రధాని మోదీ చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని.. తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డికే పట్టం కట్టాలని కోరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లలో గెలవడం ద్వారా గతంతో పోలిస్తే పుంజుకున్నామని.. అదే స్థాయిలో ఈ ఉప ఎన్నికలోనూ గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ వర్గం ఓటర్లపై బీజేపీ పెద్దగా ఆశలు పెట్టుకోనప్పటికీ ఇతర వర్గాల ఓటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమకు అండగా నిలుస్తారని ఆ పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 
ఓటర్ల మౌనం..
పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో మంచిచెడుల గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఓటర్లు నిరాకరిస్తున్నారు. ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేమని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరేం చెప్పినా, ఎవరికి ఓటు వేయాలని సూచించినా పోలింగ్ రోజు మనసులో ఉన్న దానిని బట్టి ప్రాధాన్యతలను తేల్చుకుంటామని ఇంకొందరు బస్తీలవాసులు అంటున్నారు. అయితే ఆటో కార్మీకులు, చిరువ్యాపారులు, కూలీలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఉందని ఆటో డ్రైవర్లు... రియల్టీ నిదానించడం వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని భవన నిర్మాణ కూలీలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. దశలవారీగా అయినా రాబోయే రోజుల్లో గ్యారెంటీలు అమలవుతాయనే ఆశాభావం సైతం కొందరిలో కనిపించింది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటి అంశాలను బస్తీ ఓటర్లు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాగా, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ప్రలోభాల పర్వాన్ని మొదలుపెట్టాయి.


