
ఎన్నికలకు వెళ్లటానికే ప్రభుత్వం మొగ్గు
మంత్రులతో సమావేశంలో సీఎం కీలక నిర్ణయం
నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై త్వరలో జీవో!
ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి.. వెంటనే వచ్చేవారంలోనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఎన్నికలు వాయిదా వేయడం కంటే ముందుకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదివారం ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే గురువారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
మెజారిటీ అభిప్రాయం మేరకే..: గ్రామ పంచాయతీలకు దాదాపు 20 నెలలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు దాదాపు 14 నెలల కిందట కాలపరిమితి ముగిసింది. ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని భావించి ఇంతకాలం ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఓబీసీలకు రిజర్వేషన్ల కల్పనకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్‌కు పంపగా, దానిని ఆయన రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు.
ఇప్పుడు ఆ బిల్లు రాష్ట్రపతి వద్దనే పెండింగ్‌లో ఉంది. దీంతో మరో ప్రయత్నంగా పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా పరిమితి విధించిన నిబంధనను తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. ఆ బిల్లు కూడా ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌లోనే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆపే అధికారంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు తేలిన తరవాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.
కానీ, శనివారం సాయంత్రం ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితర అందుబాటులో ఉన్న మంత్రులతోపాటు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోనూ సమాలోచనలు జరిపారు. అనంతరం ఎన్నికలకు వెళ్లడానికే మొగ్గు చూపినట్లు తెలిసింది. హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. రిజర్వేషన్ల జీవో జారీ చేసిన తరువాత న్యాయస్థానాలకు వెళ్లే సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.