
భువనగిరి: మాజీ డీఎస్పీ నళిని ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్న ఓ బహిరంగ లేఖకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘ఇక నా ప్రయాణం ముగియనుంది’ అంటూ ఆమె రాసిన లేఖ సీఎం రేవంత్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా నళినితో మాట్లాడాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును ఆదేశించారు. దాంతో కలెక్టర్ హనుమంతరావు.. మాజీ డీఎస్పీని కలిసి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఆమెకు కలెక్టర్ వివరించారు. సర్వీసు ఇష్యూలు ఏం ఉన్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి తెలియజేశారు కలెక్టర్.
ఇదిలా ఉంచితే, తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఫేస్‌బుక్ ద్వారా ఆదివారం పంచుకున్న ఒక బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది. మరణ వాంగ్మూలం అంటూ పేర్కొన్న ఈ పోస్టులో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. ఫేస్‌బుక్ పోస్టులో నళిని పేర్కొన్న ప్రకారం.. ‘ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ల జబ్బు, రెండు నెలలుగా ఫీవర్ వైరస్‌ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. 2018లో ఈ జబ్బు రాగా, హరిద్వార్ వెళ్లి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్‌లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక, డబ్బు లేదు’అని పేర్కొన్నారు.
ఇక్కడ చదవండి: