
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధికి
వైద్యానికి డబ్బు లేదు
మరణ వాంగ్మూలం అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులో మాజీ డీఎస్పీ నళిని
సాక్షి, హైదరాబాద్/భువనగిరి: తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఫేస్‌బుక్ ద్వారా ఆదివారం పంచుకున్న ఒక బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది. మరణ వాంగ్మూలం అంటూ పేర్కొన్న ఈ పోస్టులో తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. ఫేస్‌బుక్ పోస్టులో నళిని పేర్కొన్న ప్రకారం.. ‘ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ల జబ్బు, రెండు నెలలుగా ఫీవర్ వైరస్‌ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. 2018లో ఈ జబ్బు రాగా, హరిద్వార్ వెళ్లి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్‌లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక, డబ్బు లేదు’అని పేర్కొన్నారు.
నా గతమంతా వ్యథాభరితం
‘నా గతమంతా వ్యథాభరితం. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్‌మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లెంను కసి తీరా దింపింది. మహర్షి దయానందుని దయవల్ల యజ్ఞ బ్రహ్మగా వీవైపీఎస్ (వేదయజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలిగా ఎదిగాను. ఇలాంటి తరుణంలో నేటి సీఎం (రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) అధికారంలోకి రాగానే నా ఫైల్ తెరిచారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్‌పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్కకట్టి (సుమారు రూ.2 కోట్లు) ఇవ్వండి అని ఓ లేఖ ఇచ్చాను.
ఆరు నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్లీ స్కాన్ చేసి పంపినా, స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి..నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. దేశ ప్రధాని నరేంద్రమోదీని కలవలేక పోయాను. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్‌కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను..సెలవిక మిత్రులారా ’అని నళిని పేర్కొన్నారు.