తెలంగాణ నుంచి పోటీ చేయండి  | Sakshi
Sakshi News home page

తెలంగాణ నుంచి పోటీ చేయండి 

Published Tue, Feb 6 2024 4:34 AM

CM Revanth Reddy appeal to Sonia Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాందీకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సోనియాను తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. కాగా దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని సోనియా.. రేవంత్‌కు చెప్పారు.

సోమవారం ఢిల్లీలోని సోనియా అధికారిక నివాసం 10, జన్‌పథ్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ఆమెతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి సోనియాగాందీకి రేవంత్‌ వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.15 లక్షలకు పెంపు అమలు చేస్తున్నామని తెలిపారు. తాజాగా రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ , 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

బీసీ కులగణన చేపడుతున్నాం 
రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు ఇప్పటికే అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తిస్థాయిలో కసరత్తు అనంతరం బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు. 

భారత్‌ న్యాయ్‌ యాత్రలో సీఎం  
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ న్యాయ్‌ యాత్రలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. భట్టి, పొంగులేటితో కలిసి జార్ఖండ్‌ వెళ్లిన సీఎం రాజధాని రాంచీలో రాహుల్‌ను కలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న రెండు గ్యారంటీల గురించి వివరించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరును కూడా వివరించారు.  

రూ.1,800 కోట్ల గ్రాంటు విడుదలకు సహకరించండి 
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన రూ.1,800 కోట్ల గ్రాంటు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ భేరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనతో భేటీ అయిన రేవంత్‌.. హైదరాబాద్‌లో మూసీ నది రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు.

ప్రపంచ బ్యాంకు ఎయిడ్‌ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులు ఇవ్వాలని, వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు.   

Advertisement
 
Advertisement