
చెన్నైలో సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తాం: సీఎం రేవంత్
తమిళనాడులో ఈ పథకం నా హృదయాన్ని తాకింది
కరుణానిధి స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో 69 శాతం రిజర్వేషన్లు
ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ,ఎస్టీలకు 27 శాతం అమలు
చెన్నైలో ‘విద్యలో ముందంజలో తమిళనాడు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’పథకం తన హృదయాన్ని తాకిందని, వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వ ఆహ్వానం మేరకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘విద్యలో ముందంజలో తమిళనాడు’కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. అన్నాదురై, కరుణానిధి, కామరాజ్ వంటి గొప్ప యోధులు జన్మించిన రాష్ట్రం తమిళనాడు అని కొనియాడారు.
కరుణానిధి విజన్‌ను స్టాలిన్, ఉదయనిధి అమలుచేస్తున్నారని అభినందించారు. ‘మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం. మా రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 27 శాతం.. మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం’అని వెల్లడించారు. ఎన్నో శతాబ్దాల నుంచి తమిళ, తెలుగు రాష్ట్రాలు, ప్రజల మధ్య సాంస్కృతిక, చారిత్రకంగా బలమైన సంబంధం ఉందని గుర్తుచేశారు. సామాజిక న్యాయం అమలులో తమిళనాడు, తెలంగాణ మధ్య సారూప్యతలున్నాయని సీఎం అన్నారు.
తమిళనాడు విద్యావిధానం దేశానికి అనుసరణీయం
మద్రాస్ స్టేట్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కామరాజ్ నాడు తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం నేడు అనుసరిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాందీ.. కామరాజ్ ప్లాన్‌ను తీసుకువచ్చారని, ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణాదికి చెందిన కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు విద్యా విధానం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో తాము విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు పేదలకు అండగా మంచి సీఎం స్టాలిన్ ఉన్నారని ప్రశంచారు.
స్కిల్,, స్పోర్ట్స్ వర్సిటీలు తెచ్చాం
తెలంగాణలో యువతలో నైపుణ్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ గుర్తుచేశారు. ‘తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. నైపుణ్యలేమితో ఉద్యోగాలు దక్కకపోతుండడంతో వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు సాధించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించాం.
ఇక్కడ అనేక మంది క్రికెట్, టెన్నిస్, ఇతర క్రీడాకారులు ఉన్నారు. అందులోకి సంజయ్ గోయెంకా, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, ఉపాసన కొణిదెల వంటి క్రీడాకారులు, కార్పొరేట్లను తీసుకున్నాం. స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. తమిళ విద్యార్థులు, కోచ్‌లకు స్పోర్ట్స్ యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తాం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించే బాధ్యత తెలంగాణ–తమిళనాడు తీసుకుంటాయి. మోదీ, అమిత్ షాతో అది సాధ్యం కాదు’అని సీఎం పేర్కొన్నారు.
వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట చదువుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘గతంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలు ఉండేవి. మేం వారంతా వేర్వేరని అనుకోవడం లేదు. అందుకే వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే చోట చదువుకుంటారు.
ప్రతి స్కూల్‌ను 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్నాం. 1956లో ప్రారంభించిన ఐటీఐల్లో ఇప్పటికీ అదే సిలబస్ కొనసాగిస్తున్నారు. డీజిల్ మెకానిక్, ప్లంబర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ శిక్షణ తీసుకున్న వారికి ఉపాధి లభించడం లేదు. అందుకే టాటా కంపెనీ భాగస్వామ్యంతో తెలంగాణలో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా ( అఖీఇ) అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఇటీవలే నూతన విద్యా విధానం తీసుకువచ్చాం.
అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి నర్సరీ ప్రారంభిస్తున్నాం. తమిళనాడులో మాదిరే తెలంగాణలో కూడా అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయి. తమిళనాడు, తెలంగాణ దేశానికి రోడ్‌మ్యాప్ ఇవ్వనున్నాయి. నాలెడ్జ్ హబ్ కానున్నాయి. విద్య మాత్రమే దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నాం. విద్యను విప్లవంగా మేం భావిస్తున్నాం’అని తెలిపారు.