పెట్టుబడులకు 'ఎనర్జీ' | CII representatives with CM Revanth Reddy For Investments | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు 'ఎనర్జీ'

Jan 18 2024 1:18 AM | Updated on Jan 18 2024 1:18 AM

CII representatives with CM Revanth Reddy For Investments - Sakshi

దావోస్‌లో గౌతమ్‌ అదానీని జ్ఞాపికతో సత్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

సీఎంతో సీఐఐ ప్రతినిధులు 
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన పలు పరిశ్రమల సీఈవోలు బుధవారం దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులతో భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధి కోసం తీసుకునే అన్నిరకాల నిర్ణయాలకు సీఐఐ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.  

సాక్షి, హైదరాబాద్‌:  స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) 54వ వార్షిక సదస్సులో భాగంగా.. రెండో రోజు బుధవారం పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దావోస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం.. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించి, ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా రూ.37,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరినట్టు, కీలక ప్రకటనలు వెలువడినట్టు తెలిపింది. సీఎంవో తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రూప్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఏరోస్పేస్‌–డిఫెన్స్‌ విభాగం సీఈఓ ఆశిశ్‌ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.  

గ్రీన్‌ ఎనర్జీ.. స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌.. 
అదానీ గ్రూప్‌తో ఒప్పందాల్లో భాగంగా రూ.5వేల కోట్ల పెట్టుబడితో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్‌ ఎనర్జీ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. అనుబంధ సంస్థ అదానీ కొనెక్స్‌ మరో రూ.5వేల కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ క్యాంపస్‌ను చందన్‌పల్లిలో ఏర్పాటు చేస్తుంది. ఇక అంబుజా సిమెంట్స్‌ సంస్థ ద్వారా ఏటా 6 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ను రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్‌ పార్క్‌లో కౌంటర్‌ డ్రోన్‌ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతలో నైపుణ్యాలు (స్కిల్స్‌) పెంపొందించేందుకు త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రేవంత్‌తో భేటీ సందర్భంగా అదానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. 

► తెలంగాణలో రూ.9వేల కోట్లతో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’తో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో సీఎం రేవంత్‌ చర్చించారు. 

► రాష్ట్రంలో రూ.8వేల కోట్ల పెట్టుబడితో 12.5 జీడబ్ల్యూహెచ్‌ (గిగావాట్‌ ఫర్‌ అవర్‌) సామర్థ్యముండే బ్యాటరీ సెల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్‌ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధన, అభివృద్ధి కేంద్రంతోపాటు, గిగాస్కేల్‌ బ్యాటరీ సెల్‌ తయారీ కేంద్రం ఏర్పాటవుతుంది. ప్రాజెక్ట్‌ మొదటి దశలో 6వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొదటి దశలో 2.5 గిగావాట్ల సామర్థ్యముండే సెల్‌ అసెంబ్లింగ్‌ లైన్‌ తయారు చేసి.. రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. 

► డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్‌ మౌంటేన్‌ అనుబంధ సంస్థ వెబ్‌ వెర్క్స్‌ తెలంగాణలో రూ.5,200 కోట్లతో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐరన్‌ మౌంటేన్‌ సీఈవో విలియం మీనీ, వెబ్‌ వెర్క్స్‌ సీఈవో నిఖిల్‌ రాఠీలతో సీఎం రేవంత్‌ భేటీలో రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్‌వర్కింగ్‌–హెవీ డేటా సెంటర్‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా రూ.4,000 కోట్లకుపైగా పెట్టుబడులతో భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. 

► రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ మిషన్‌లో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఖమ్మంలో దేశంలోనే మొట్టమొదటి ఆయిల్‌పామ్‌ సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త సీడ్‌ గార్డెన్‌ ద్వారా ఏటా 70లక్షల మొక్కలను సరఫరా చేయడం ద్వారా పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టవచ్చని పేర్కొంది. దీంతోపాటు రూ.వెయ్యి కోట్లతో కెమికల్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని గోద్రెజ్‌ సంస్థ ప్రకటించింది. నైపుణ్య శిక్షణ, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, పాడి పరిశ్రమ విస్తరణ వంటి అంశాలపైనా గోద్రెజ్‌ సీఎండీ నాదిర్‌ గోద్రెజ్‌తో సీఎం చర్చించారు. 

► రాష్ట్రంలోని మల్లాపూర్‌లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌’ సంస్థ రూ.2వేల కోట్ల పెట్టుబడులు, 1,500 మందికి కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యకలాపాలను విస్తరించనుంది. సీఎం రేవంత్‌తో ఆరాజెన్‌ సీఈఓ మణి కంటిపూడి భేటీ సందర్భంగా దీనిపై ఒప్పందం కుదిరింది. ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ విస్తరణతో హైదరాబాద్‌ దేశంలోనే కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ హబ్‌గా మారనుందని ఆ సంస్థ పేర్కొంది. 

► దావోస్‌ రెండోరోజు పర్యటనలో భాగంగా రేవంత్‌ బుధవారం హెయిన్‌కెన్‌ ఇంటర్నేషనల్‌ సీఈఓ డాల్ఫ్‌ వాన్‌డెన్‌ బ్రింక్, టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖర్, విప్రో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రిషబ్‌ ప్రేమ్‌జీ తదితరులతోనూ భేటీ అయ్యారు. వరంగల్‌లో ఐటీ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి రిషబ్‌ ప్రేమ్‌జీతో చర్చించారు. ఈ భేటీల్లో ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement