మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’ | CI Suresh Kumar Inspires Others By Singing Songs Hyderabad | Sakshi
Sakshi News home page

మంచిని పెంచే ‘సరిగమల ఖాకీ’

Jun 22 2026 8:54 AM | Updated on Jun 22 2026 8:57 AM

CI Suresh Kumar Inspires Others By Singing Songs Hyderabad

పాటలు పాడుతూ స్ఫూర్తిని నింపుతున్న సీఐ

ఓ వైపు విధి నిర్వహణ, మరో వైపు సమాజంలో అవగాహన 

పోలీసులంటేనే నిత్యం ఏదో ఒక ఒత్తిడి, బందోబస్తులు, కేసులు, గొడవలు, కొట్లాటలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సమయం ఇవ్వలేని విధులు... కానీ తనకున్న కళతో ఓ అధికారి ఒక వైపు వి«ధులను సక్రమంగా నిర్వహిస్తూనే మరో వైపు సమాజంలో యువతను, పౌరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతున్నాడు.

నగరంలోని రాంగోపాల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న బోడసింగి సురేష్‌ కుమార్‌ దేశ భక్తిగీతాలు ఆలపించడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు నిజ జీవిత సంఘటనలపై పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన సురేష్‌ గతంలో పని చేసిన జిల్లాలో సైతం ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో యువతను, స్థానికంగా ఉండే ప్రజలకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

పాటకు దేన్నైనా మార్చే శక్తి ఉంటుందని, మంచిని పెంచడానికి పది మందిలో స్ఫూర్తిని నింపి మంచి మార్గంలో నడిపించేందుకు పాట ఒక ఆయుధంగా పని చేస్తుందనే విషయాన్ని తాను నమ్ముతానని సురేష్‌ కుమార్‌ చెబుతున్నారు. ఇప్పటి వరకు సురేష్‌ కుమార్‌ సమాజాన్ని మేల్కొల్పేందుకు రచించిన జై భారత్‌ జెండా, షీ టీమ్స్‌ వల్ల అమ్మాయిలకు ఎటువంటి రక్షణ లభిస్తుందో తెలియజేసే పాట, పల్లెను వదిలి పట్నానికి రాలేని ఓ పల్లెటూరి వ్యక్తి బాధ, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు, అడవుల పరిరక్షణకై ఓ పాట, తండ్రి ప్రాముఖ్యత, పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలు, తండ్రి కష్టాన్ని తెలియజేసేలా రచించిన పాట ఇలా ఎన్నో రకాల పాటలను పాడి ఆకట్టుకున్నారు.

ఏదైనా విషయాన్ని పాట రూపంలో చెప్తే అందరూ అటెన్షన్‌లోకి వస్తారని అందులోనూ ఖాకీ యూనిఫాం ధరించి తాను పాట పాడుతుంటూ అంతా కూడా ఆసక్తిగా చూడటంతో పాటు పాట భావాన్ని అర్థం చేసుకొని మంచి మాటలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. కరోనా సమయంలో కూడా భయపడవద్దని, ఎలా ఉండాలో చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను తయారు  చేయించి మరీ పాడారు.

పాట రూపంలో చెప్తే అందరూ వింటారు..
చదువుకునే రోజుల నుంచే నాకు పాటలంటే ఇష్టం. పోలీస్‌ ఉద్యోగం వచ్చినా కూడా పాడే అలవాటును మాత్రం వదులుకోలేదు. శాంతి భద్రతల పరిరక్షణతో ఓ వైపు కషి చేస్తూనే మరో వైపు సమాజంలో మంచిని పెంచేందుకు పాటల రూపంలో కషి చేస్తూనే ఉన్నా. ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్షర జ్ఞానం లేని వారినే కాదు బాగా చదువుకున్న వాళ్ళను కూడా సైబర్‌ నేరగాళ్ళు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకొని సైబర్‌ నేరగాళ్ళతో అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పాటను తయారు చేయించి పాడబోతున్నాను. మా ఉన్నతాధికకారులు కూడా నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 
- బోడసింగి సురేష్‌ కుమార్, సీఐ రాంగోపాల్‌పేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement