పార్కింగ్ స్థలాలలో సెన్సార్స్ ఏర్పాటు
‘క్లౌడ్’కు చేరనున్న స్లాట్స్ సమాచారం
స్లాట్స్ ఖాళీలను అంచనా వేయనున్న ఏఐ
యాప్‌లో యూజర్లకు పార్కింగ్ వివరాలు
పరిశోధన చేపట్టిన మహారాష్ట్ర విద్యార్థి
సాక్షి, స్పెషల్ డెస్క్: నగర వాసులకు పార్కింగ్ సమస్యల గురించి కొత్తగా చెప్పక్కర లేదు. వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొన్నవారే. మాల్స్, పెద్ద హోటళ్ల విషయంలోనూ ఇటువంటి ఇబ్బంది తప్పడం లేదు. ఇతర ప్రదేశాల్లో కారు పార్క్ చేద్దామంటే స్థలం దొరకని పరి స్థితి. లేదా ఆ కొద్ది స్థలంలో అప్పటికే వాహ నాలు సేదతీరుతుంటాయి. వారాంతాలు, పండుగల సమయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. భారత్‌లో పార్కింగ్ అనేది వాహన దార్లకు రోజువారీ అసౌకర్యం మాత్రమే కాదు. పూర్తి స్థాయి పట్టణ సంక్షోభం కూడానూ.
ఈ సమస్యకు.. మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి చేపట్టిన పరిశోధన ఆశాదీపంలా కనిపి స్తోంది. భారత్‌లో ఏటా కోట్లాది కొత్త వాహనాలు రోడ్డెక్కు తున్నాయి. 2024–25లో అన్ని విభాగాల్లో కలిపి 2.56 కోట్లకుపైగా వాహనాలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. వీటి స్థాయిలో పార్కింగ్ స్థలాలు మాత్రం పెరగడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో ఈ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని మహారాష్ట్రలోని ఎస్‌ఎన్ జేబీకి చెందిన కాంతాబాయి భావర్లాల్జీ జైన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రణవ్ సునీల్ ఉపాసనీ చేసిన కొత్త పరిశోధన చెబుతోంది.
ఇంధనం సైతం ఆదా..
‘ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ రీసెర్చ్ ఇన్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ’లో ప్రచురితమైన ఈ పరిశోధనలో ఏఐ, ఐఓటీ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను ప్రణవ్ సునీల్ ఉపాసనీ ప్రతిపాదించారు. పార్కింగ్ స్థలాలలో చిన్న సెన్సార్స్ ఏర్పాటు చేయాలి. ఇవి స్లాట్ ఖాళీగా ఉందా లేదా గుర్తిస్తాయి. ఈ సమాచారం క్లౌడ్‌కి వెళుతుంది. అక్కడి ఏఐ వ్యవస్థ స్లాట్ ఏ సమయంలో, ఎక్కడ ఖాళీగా ఉంటుందో అంచనా వేస్తుంది.
స్మార్ట్‌ఫోన్ లోని ఒక సాధారణ యాప్ యూజర్‌కు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పార్కింగ్‌ను చూపుతుంది. అవసరమైతే యూజర్ వెళ్లే స్థలంలో పార్కింగ్ స్లాట్‌ను ముందే బుక్ చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించినట్టుగానే మొబైల్ ఫోన్లో ఖాళీ పార్కింగ్ స్థలాన్ని చూసుకోవచ్చు. పార్కింగ్ కోసం వెతికే సమయాన్ని ఇలాంటి వ్యవస్థ 40% వరకు తగ్గించగలదని, ఇంధనాన్ని సైతం ఆదా చేయ గలదని, ట్రాఫిక్ జామ్స్‌ను తగ్గించగలదని అధ్యయనం వెల్లడించింది.
పూర్తి స్థాయిలో వినియోగంలోకి..
ఇల్లు, ఆఫీసు నుంచి బయలుదేరి ఒక యాప్ తెరిచి.. వెళ్లాల్సిన మాల్, హోటల్, షాపింగ్ ఏరియాలో ఏ స్థలం ఖాళీగా ఉందో చూడగలిగితే అంతకంటే సౌకర్యం ఏముంటుంది! రోజువారీ పార్కింగ్ సమాచారమేకాదు.. వారాంతాలు, పండుగ రద్దీలను సైతం అధ్యయనం చేయగలిగే సత్తా ఏఐకి ఉందని అధ్యయనం వెల్లడించింది. ‘పార్కింగ్ లభ్యతను ముందుగానే అంచనా వేయడానికి ఈ సమాచారం దోహదం చేస్తుంది. వాహనదార్లకు పార్కింగ్ సౌలభ్యాన్ని మెరు గు పరచడంతోపాటు తక్కువగా ఉపయోగిస్తున్న పార్కింగ్ జోన్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవొచ్చు. రోడ్ల మీద అక్రమ పార్కింగ్‌ను తగ్గిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్, ఆటో మేటెడ్ బిల్లింగ్ సిస్టమ్స్‌కు దోహదం చేస్తుంది. ఈ ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకు రావడానికి ప్రభుత్వ విభాగాలు, టెక్ కంపెనీలు, సిటీ ప్లానర్స్ మధ్య సహకారం, సమన్వయం కావాలి’ అని తెలిపింది.
ఇలా పనిచేస్తుంది..
⇒ పార్కింగ్ ప్లేస్‌లలో సెన్సార్స్ ఏర్పాటు చేయాలి.
⇒ ఈ సెన్సార్స్ స్లాట్ ఖాళీగా ఉందా లేదా గుర్తిస్తాయి.
⇒ ఈ సమాచారం క్లౌడ్‌లో లైవ్‌లో నిక్షిప్తం అవుతుంది.
⇒ స్లాట్ ఏ సమయంలో, ఎక్కడ ఖాళీగా ఉంటుందో ఏఐ అంచనా వేస్తుంది.
⇒ స్మార్ట్‌ఫోన్ లోని యాప్ ద్వారా ఖాళీగా ఉన్న పార్కింగ్ స్లాట్స్‌ను చూడవచ్చు.
ఇవీ ప్రయోజనాలు..
⇒ ట్రాఫిక్ గందరగోళం తగ్గుతుంది
⇒ వెతుకులాట తగ్గడంతో కాలుష్యమూ దిగొస్తుంది
⇒ పార్కింగ్ స్థలాలను మెరుగ్గా వినియోగించుకోవచ్చు
⇒ వాహనదార్లకు సౌకర్యవంతం


