ధాన్యం విక్రయ టెండర్లు రద్దు? | Sakshi
Sakshi News home page

ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?

Published Fri, Sep 22 2023 2:53 AM

Cancellation of grain sale tenders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్‌–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్‌కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్‌ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం

మద్దతు ధరతో సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్‌ కింద ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్‌మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొన్న ధరకన్నా తక్కువకు..
25 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్‌ బిడ్స్‌ తెరిచిన తరువాత గురునానక్‌ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్‌–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి.

సగటున చూస్తే క్వింటాల్‌ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్‌ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది.

ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement