రాజధాని జోన్–8 ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ టెండర్లలో అక్రమాలు
లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున రూ.2 కోట్లు వ్యయం!
దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున ఖర్చు చేసిన దాఖాలాలు లేవు..
రూ.1,305.39 కోట్లతో టెండర్లు పిలిచిన ఏడీసీఎల్
4.03% అధిక ధర... రూ.1,358 కోట్లకు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ
ఖజానాకు రూ.52.61 కోట్ల నష్టం... ఆ మేర కాంట్రాక్టర్‌కు ప్రయోజనం
జీఎస్టీ వంటి పన్నుల రూపంలో మరో రూ.277.85 కోట్లు రీయింబర్స్‌మెంట్
దీంతో రూ.1635.85 కోట్లకు చేరనున్న మొత్తం కాంట్రాక్టు విలువ
రూ.135.80 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులో నీకింత నాకింత
కాంట్రాక్టర్‌కు దోచిపెట్టి పంచుకుతినడాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న ముఖ్య నేత
రివర్స్ టెండరింగ్ ఉండి ఉంటే ఖజానాకు కనీసం రూ.100 కోట్లకు పైగా ఆదా
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి సమీకరణ (పూలింగ్) కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇచ్చే మాటేమో గానీ... లే అవుట్ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేత భారీఎత్తున దోచుకుంటున్నారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. జోన్–8 (కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి) లేఅవుట్ అభివృద్ధి పనుల అంచనాలను ప్రతిపాదన దశలోనే భారీగా పెంచేయడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున రూ.2 కోట్ల మేర వ్యయం చేస్తున్నారని... దేశ చరిత్రలో ఇది ఎక్కడా లేదని ఎత్తిచూపుతున్నారు.
⇒ రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ వంటి వాటికి యుటిలిటీ డక్ట్‌లు, మురుగు శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్ వినియోగించేందుకు పైప్‌లైన్, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు రూ.1305.39 కోట్ల వ్యయంతో నవంబర్ 14న అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీఎసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
వీటిని 4.03 శాతం అధిక ధర... రూ.1,358 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు అప్పగించడానికి సీఆర్‌డీఏ, కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఆ మేరకు ఏడీసీఎల్‌కు అనుమతి ఇస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఖజానాపై రూ.52.61 కోట్ల భారం పడనుండగా ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరనుంది. ఇక జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.277.85 కోట్లను రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. తద్వారా కాంట్రాక్టు విలువ రూ.1,635.85 కోట్లకు చేరనుంది.
జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే...
రాజధాని జోన్–8 లేఅవుట్ అభివృద్ధి పనులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కనీసం 5 శాతం తక్కువ ధరకు పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు రూ.వంద కోట్లు ఆదా అయ్యేవని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జ్యుడీషియల్ ప్రివ్యూ విధానం అమల్లో ఉండి ఉంటే... టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అక్రమాలు వెలుగులోకి వచ్చేవని, తద్వారా అంచనా వ్యయం తగ్గేదని చెబుతున్నారు. ప్రజాధనం భారీగా ఆదా అయ్యేదని స్పష్టం చేస్తున్నారు.
మొబిలైజేషన్ అడ్వాన్సులో నీకింత నాకింత
కాంట్రాక్టర్‌కు రూ.1,358 కోట్లకు పనులను అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఆ మేరకు ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోనుంది. ఆ వెంటనే కాంట్రాక్టు విలువలో పదిశాతం రూ.135.80 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ముట్టజెప్పనుంది. ఇందులో 8 శాతం ముఖ్య నేత తొలి విడత కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టి నీకింత నాకింత అంటూ పంచుకుతినడాన్ని ముఖ్య నేత యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఇంజినీరింగ్ నిపుణులు, ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు.


