2014 నుంచి ‘సింగరేణి’లో అమలైన అన్ని కాంట్రాక్టులపై విచారణకు రెడీ
విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
టెండర్లపై విషపు రాతల రాధాకృష్ణ వండి వార్చినవన్నీ వదంతులే
పత్రికాధిపతినని ఏది రాసినా చెల్లుతుందనుకుంటే ఊరుకోం
నా వ్యక్తిత్వాన్ని ఒక్క కలం పోటుతో దెబ్బతీస్తానంటే సహించేది లేదు
రాసిన కథనాలన్నీ పొరపాటని ఆయన అంగీకరించాలి
సింగరేణిపై హరీశ్‌రావు లేఖ రాస్తే విచారణకు సీఎంను ఒప్పిస్తా
కాంట్రాక్టు సంస్థలకు సైట్ విజిట్ నిబంధన మేం తెచ్చింది కాదు
కోల్ ఇండియా సహా కేంద్ర సంస్థలన్నీ దాన్నే అమలు చేస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: నైనీ కోల్‌బ్లాక్ సహా 2014 నుంచి ఇప్పటివరకు సింగరేణిలో అమలైన అన్ని కాంట్రాక్టులపై విచారణకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తమ ప్రభుత్వానికి లేఖ రాస్తే విచారణకు సీఎంను ఒప్పిస్తానని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసమే టెండర్లపై కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. సింగరేణి టెండర్లపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ శనివారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భట్టి విలేకరుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. నైనీ కాంట్రాక్టును ముఖ్య మంత్రి బావమరిదికి కట్టబెట్టాలని చూస్తున్నామనే ప్రచారం సత్యదూరమని.. ఇదంతా ఏబీఎన్ రాధాకృష్ణ వండి వార్చిన వదంతులేనని కొట్టిపారేశారు. ఆయా కథనాలను వేల మంది సింగరేణి కార్మీకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. సింగరేణిపై గద్దలు, రాబందులు కన్నేశాయని.. వాటిని వాలనివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు.
సైట్ విజిట్ కొత్తేం కాదు
కాంట్రాక్టు సంస్థలు సైట్ విజిట్‌కు వెళ్లాలన్న నిబంధన కొత్తదేం కాదని భట్టి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, ప్రభుత్వరంగ చమురు సంస్థలు, రక్షణ శాఖ సహా మరెన్నో కేంద్ర సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయంటూ అందుకు సంబంధించిన పత్రాలను మీడియాకు చూపారు. ఈ నిబంధనను తానే తీసుకొచ్చినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అని, టెండర్ల వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు తన వద్దకు రావని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే టెండర్లను రద్దు చేశామని వివరించారు. ఇంకా టెండర్ కోరిజెండం (సవరణ) రిలీజ్ చేయలేదని.. టెండర్ సమర్పించే తేదీ కూడా మొదలవలేదన్నారు. అలాంటప్పుడు సైట్ విజిట్ చేసినప్పటికీ కాంట్రాక్టు సంస్థలకు సర్టిఫికెట్లు ఇవ్వలేదనేది అవాస్తవమని భట్టి తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే కొత్త డీజిల్ విధానం
సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించి కుంభకోణానికి పాల్పడినట్లు బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చేసిన విమర్శలను భట్టి ఖండించారు. 2022లోనే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ కొత్త విధానం తెచ్చిందన్నారు. జీఎస్టీ విధానంలో మార్పులు, డీజిల్ దొంగతనాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దేశవ్యాప్తంగానూ ఇదే విధానం అనుసరిస్తున్నారని చెప్పారు.
అయిన వాళ్లకు కట్టబెట్టిందెవరు?
సింగరేణి కాంట్రాక్టు వ్యవహారానికి.. ముఖ్యమంత్రి, ఆయన బావమరిదికి సంబంధమే లేదని భట్టి స్పష్టం చేశారు. ఇదో కట్టుకథని కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్నట్లుగా సుజన్‌రెడ్డికి చెందిన కంపెనీ శోధా కనస్ట్రక్షన్స్ అనే ప్రైవేటు కంపెనీ ఎండీ దీప్తిరెడ్డి అని, ఆమె బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కుమార్తె అని భట్టి చెప్పారు. దీన్నిబట్టి ఈ వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలున్నాయో ఆలోచించుకోవాలన్నారు. కాంట్రాక్టుల ఆశ చూపి ఉపేందర్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి లాక్కున్నారని ఆరోపించారు. సింగరేణిలో కాంట్రాక్టు పనులు చేస్తున్న ఐదు ప్రధాన కాంట్రాక్టు సంస్థలన్నీ బీఆర్‌ఎస్ నేతల బంధువులవేనని తెలిపారు.
కట్టుకథలు.. విషపు రాతల రాధాకృష్ణ
‘పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతల రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో మొదలుపెట్టిన కథనాలన్నీ సింగరేణిపై తప్పుడు ప్రచారానికి దారి తీశాయి. పత్రికాధిపతి అని ఏది రాసినా చెల్లుతుందనుకుంటే పొరపాటు. మేం చూస్తూ ఊరుకోం’అని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా నింద వేయడమే ఆయన కథనాల ఉద్దేశమన్నారు. ఏ గద్దలు, రాబందులు, దోపిడీదారుల ప్రయోజనాల కోసమో.. ఎవరి కళ్లలో ఆనందం కోసమో ఈ కథనాలు రాస్తున్నట్లుగా ఉందన్నారు. ఆయన కథనం రాయడం, బీఆర్‌ఎస్ నేత విచారణ కోరుతూ లేఖ రాయడం, కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ ముగ్గురి మధ్య సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని ఒక్క కలం పోటుతో దెబ్బతీస్తానంటే సహించేది లేదని.. ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ పొరపాటని ఆయన అంగీకరించాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్ దోషులకు శిక్ష పడాలి: మంత్రి జూపల్లి
ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ దోషులకు శిక్షలు పడాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకే విచారణ చేపడుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సిట్ విచారణ జరుపుతుంటే బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కేటీఆర్‌ను సిట్ సాక్షిగానే పిలిచిందని.. దోషిగా కాదన్నారు. తమ ప్రభుత్వానికి ఆయనపై కక్ష సాధించాలనే ఆలోచన ఉండి ఉంటే ఇప్పటికే అరెస్టు చేసి ఉండే వాళ్లమన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ప్రభాకర్‌రావు ఇంతకాలం విదేశాల్లో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించారు.


