సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శనివారం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీలో ‘సిట్’విచారణ తీరు తెన్నులను ఇద్దరు నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించారు. పార్టీ ముఖ్య నేతల పర్యటనలు, మంత్రులుగా తీసుకున్న నిర్ణయాలు, పలువురు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వారితో సంబంధాలు, పరిచయాల గురించి పోలీసులు తమను ప్రశ్నించారని వివరించారు. పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళాలు ఇచ్చిన సంస్థల వివరాలపై ఆరా తీసినట్లుగా కేసీఆర్‌కు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విచారణతో సంబంధం లేని అంశాలను సిట్ అధికారులు అడిగిన వైనాన్ని కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలోనే సంబంధం లేని విషయాల్లో విచారణల పేరిట ప్రభుత్వం హడావుడి చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిట్ విచారణకు సహకరిస్తూనే పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం కూడా చేయాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది.
మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ సూచనలు
మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఉమ్మడి జిల్లాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వం, అవసరమైన చోట ఇతర పార్టీల నుంచి చేరికలు వంటి అంశాలపై ఇద్దరు నేతలు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షించేందుకు జిల్లాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు.
పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు మున్సిపాలిటీల వారీగా పర్యవేక్షక బాధ్యతలు అప్పగించనున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా ఇన్‌చార్జిలు పర్యవేక్షించడంతో పాటు నాయకులు, కేడర్ నడుమ క్షేత్ర స్థాయిల్లో సమన్వయం కోసం పనిచేస్తారు. మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ ఆదేశాల మేరకు ఎర్రవల్లిలో భేటీ అనంతరం శనివారం రాత్రి హైదరాబాద్‌లో కేటీఆర్, హరీశ్‌రావు కొందరు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీల వారీగా నియమించాల్సిన ఇన్‌చార్జిల జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. భేటీ అనంతరం ఈ జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు.


