సిట్ విచారణ ముగిశాక బయటకు వస్తున్న హరీశ్‌రావు
మాజీ మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో వివిధ కోణాల్లో ఏడున్నర గంటలపాటు విచారణ
సాక్షి, హైదరాబాద్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావును ప్రశ్నించింది. కొన్ని కీలకాంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ప్రశ్నలు అడిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా చానెల్ అధినేత శ్రవణ్‌రావులతో జరిగిన సంప్రదింపులు, సమాచార మారి్పడి ప్రధాన అంశాలుగా అధికారులు ప్రశ్నలు సంధించారు.
ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగానూ కొంత వివరణ కోరారు. ప్రభాకర్‌రావుతో శ్రవణ్ సన్నిహితంగా మెలిగారు. 2023లో జరిగిన ఆయన ఫ్యామిలీ ఫంక్షన్‌కూ శ్రవణ్ హాజరయ్యారు. అక్కడే ప్రభాకర్‌రావు ద్వారా శ్రవణ్‌రావుకు ప్రణీత్‌రావు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలుమార్లు ఎస్‌ఐబీ కార్యాలయానికి వెళ్లిన శ్రవణ్‌రావు అక్కడే ప్రణీత్‌రావును కలిశారు. శ్రవణ్ తనకు ఉన్న పరిచయాలను వినియోగించి రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించేవారని, వీరిలో నాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న వారిని గుర్తించి, ఆ వివరాలను ప్రణీత్‌కు అందించారన్నది సిట్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌లతో సంబంధం ఏంటి? అని హరీశ్‌రావును ప్రశ్నించింది.
వివిధ కోణాల్లో ప్రశ్నలు
ఈ ముగ్గురితో 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు, ప్రణీత్‌రావుతో హరీశ్‌రావు సంప్రదింపులు జరిపారని, వీరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ కోసం శ్రవణ్‌రావుతో పాటు హరీశ్‌రావు ఎంపిక చేసిన వారినే టార్గెట్‌గా చేసుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో మాజీ మంత్రిని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేర్చాలని భావించిన నాటి మంత్రి హరీశ్‌రావు ఓ కీలక సమావేశానికి సిఫార్సు చేశారని అనుమానిస్తున్న సిట్ ఆ కోణంలోనూ పలు ప్రశ్నలు అడిగింది. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడంతో పాటు అధికార పక్షం నగదు రవాణాలోనూ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కోణంలోనూ ప్రశ్నించారని తెలిసింది.
ఏమీ లేదు.. అంతా తూచ్!: హరీశ్‌రావు తన న్యాయవాదితో కలిసి జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అయితే న్యాయవాదిని అనుమతించని పోలీసులు కేవలం హరీశ్‌రావుతోపాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రమే లోపలకు పంపారు. ఉదయం 10.57 గంటలకు లోనికి వెళ్లిన హరీశ్‌రావు సాయంత్రం 6.25 గంటలకు బయటకు వచ్చారు. ఏడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి, సంయుక్త పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్, డీసీపీ రితిరాజ్ తో కూడిన బృందం ఆయన్ను విచారించింది. విచారణ ముగిసి బయటకు వచి్చన హరీశ్‌రావు మీడియాను ఉద్దేశించి ‘ఏమీ లేదు.. అంతా తూచ్..ఉత్తిదే’అంటూ వెళ్లిపోయారు.
అరెస్టులు.. అస్వస్థత.. ఉద్రిక్తత
మంగళవారం ఉదయం తన ఇంటి నుంచి తెలంగాణ భవన్‌కు వచి్చ, సిట్ ఎదుట హాజరైన హరీశ్‌రావు.. విచారణ తర్వాత కూడా అక్కడికి వెళ్లారు. ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా బీఆర్‌ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ ఠాణా వద్దకు చేరుకున్నారు. అక్కడ రహదారిపై ఆందోళనకు దిగడంతో నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో బీఆర్‌ఎస్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం బీఆర్‌ఎస్ మహిళా నేతలు, కార్యకర్తల అరెస్టు సందర్భంలోనూ ఠాణా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.


