ఖరీఫ్‌కు ముందే కష్టాలు! | Bonuses 700 crore have not yet been credited to the farmers accounts | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌కు ముందే కష్టాలు!

Jun 19 2026 3:53 AM | Updated on Jun 19 2026 3:53 AM

Bonuses 700 crore have not yet been credited to the farmers accounts

యాసంగి సన్న ధాన్యానికి రావాల్సిన బోనస్‌లో రూ.700 కోట్లు ఇప్పటికీ రాలేదు..  ఇంతలో ప్రభుత్వం గుర్తించిన 7 రకాల వరి వంగడాలకే ఈసారి బోనస్‌ పరిమితమంటూ ప్రకటించింది. మరి.. ఆ రూ.700 కోట్లు ఇక రానట్టేనా? 

యాసంగి రైతు భరోసా రూ.9 వేల కోట్లు అని చెప్పినా.. అది రూ. 5,653 కోట్లకే పరిమిత మైంది.. ఈ నెల 30న ఈ ఖరీఫ్‌ రైతు భరోసా నిధులు జమచేస్తామంటూ కేబినెట్‌ భేటీ అనంతరం సర్కారు ప్రకటించింది.యాసంగి రైతు భరోసాకు మంగళం పాడినట్టేనా? 

అన్నదాతల అవస్థలు..
రైతన్నకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, ట్రాక్టర్‌ అద్దెల భారం, కూలీల కొరత, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ హెచ్చరికలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. వీటికి తాజా కష్టాలు తోడయ్యాయి. అటు రైతు బీమాలో భాగంగా ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లింపులో ఆలస్యం జరగడంతో అన్నదాతల 
కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.  

ఏడు రకాల వరికే బోనస్‌
గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యం సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ, రైతులకు అదనపు ఆదాయం అనే లక్ష్యాలతో క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో లక్షలాది మంది రైతులు దొడ్డు బియ్యం స్థానంలో సన్నాల సాగుకు మొగ్గు చూపారు. యాసంగి సీజన్‌లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సన్నాలకు వాతావరణం అనుకూలించకపోయినా వ్యయ ప్రయాసల కోర్చి రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. 

అయితే గత యాసంగిలో కొనుగోలు చేసిన దాదాపు 14 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్‌ సుమారు రూ.700 కోట్లు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వానాకాలం సీజన్‌ రావడంతో ఇక యాసంగి బోనస్‌ను వదులుకున్నట్టే. 2024–25 యాసంగిలో కూడా దాదాపు 24 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్‌ రూ.1,159 కోట్లను ఇవ్వలేదు. కాగా, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. 

ఇకపై ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల వరి వంగడాలకు మాత్రమే బోనస్‌ వర్తిస్తుందని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అంచనా ప్రకారం 38.19 లక్షల ఎకరాల్లో ఈ ఏడు రకాల సన్నాలను సాగు చేయనున్నారు. దీనికి అవసరమైన విత్తనాల పరిమాణం 9.55 లక్షల క్వింటాళ్లుగా పేర్కొన్న ప్రభుత్వం.. 15.64 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్టు చెబుతోంది. అయితే అందులో దాదాపు 13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ప్రైవేట్‌ వ్యాపారుల వద్దనే ఉండడం గమనార్హం. 

ఇందులో ఇప్పటికే 2 లక్షల క్వింటాళ్లను రైతులకు విక్రయించినట్టు వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. తెలంగాణ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వద్ద కేవలం నాలుగు రకాల విత్తనాలు 38 వేల క్వింటాళ్లు మాత్రమే ఉండగా, జాతీయ విత్తన సంస్థ (ఎన్‌ఎస్‌సీ) వద్ద కేవలం 4,838 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. రైతులు సన్నాల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

రైతుబీమా ఆలస్యం... 
రైతు బీమా డబ్బు అందక వేలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.2025–26 సంవత్సరానికి గాను రైతుబీమా ప్రీమియం కింద ఎల్‌ఐసీకి రూ.1,359 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.436 కోట్లు ఆలస్యంగా చెల్లించినట్టు తెలిసింది. ప్రభుత్వం ప్రీమియం ఆలస్యంగా చెల్లించిన  కారణంగా ఈ ఏడాది చనిపోయిన 7,606 రైతులకు సంబంధించిన రైతు బీమాను ఎల్‌ఐసీ ఇంకా  విడుదల చేయలేదు. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందలేదు.    

2 ఎకరాలకే పరిమితమైన రైతుభరోసా  
సాగు యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా కింద ప్రతి సీజన్‌కు ఎకరానికి రూ.6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. గత యాసంగిలో రాష్ట్రంలోని 71.05 లక్షల రైతుల ఖాతాల్లో రెండు ఎకరాలకు మాత్రమే రూ.5,653 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. 

మార్చి 19న తొలి విడతగా రూ.3,446.94 కోట్లు, రెండో విడతగా రూ.2,206.06 కోట్లను జమచేసింది. రూ.9 వేల కోట్లు రైతుభరోసా కింద చెల్లించనున్నట్టు ప్రకటించినా, రూ.5,653 కోట్లకే పరిమితం చేశారు. ఈ నెల 30న మధిరలో వచ్చే ఖరీఫ్‌ కోసం రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాసంగి రైతుభరోసా కథ ముగిసిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

– సాక్షి, హైదరాబాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement