ఆ సన్నాలే కావాలి! | Bonus limited to 7 types of rice varieties | Sakshi
Sakshi News home page

ఆ సన్నాలే కావాలి!

Jun 18 2026 5:15 AM | Updated on Jun 18 2026 5:15 AM

Bonus limited to 7 types of rice varieties

7 రకాల వరి వంగడాలకే బోనస్‌ పరిమితం

ఈ నేపథ్యంలో డిమాండ్‌.. కొన్ని జిల్లాల్లో విత్తనాల కోసం రైతుల ఇబ్బందులు 

డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేక రైతుల పాట్లు  

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన వేళ..రాష్ట్రంలో సన్న రకాల వరి విత్తనాలకు అనూహ్య డిమాండ్‌ ఏర్పడింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మిల్లర్లు, ఎగుమతిదారుల సూచనల మేరకు ఎంపిక చేసిన ఏడు ప్రధాన సన్న రకాల వంగడాల సాగునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ సోనా, జై శ్రీరామ్, సాంబమసూరి, హెచ్‌ఎంటీ సోనా, కూనారం సన్నాలు, సిద్ధి, కేఎన్‌ఎం–7715 రకాల సన్నరకం విత్తనాలను ఈ ఖరీఫ్‌లో సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఇస్తున్న క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను కూడా ఈ ఏడు రకాల వరి వంగడాలకే పరిమితం చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు 36 రకాల సన్నాల్లో ఏ వంగడాన్ని పండించినా, ఈ బోనస్‌ అందేది. అయితే సర్కార్‌ తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఈ ఏడు వంగడాలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఈ వంగడాల కోసం ప్రభుత్వ విక్రయ కేంద్రాలు, తెలంగాణ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎస్‌డీసీ) డిపోలు, ప్రైవేట్‌ విత్తన దుకాణాల వద్ద రైతుల తాకిడి పెరిగింది. నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది.  

ఆ ఏడింటికే ప్రాధాన్యం ఎందుకంటే.. 
వరి సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్నా, రాష్ట్రంలో పండే బియ్యానికి మార్కెట్‌లో స్థిరమైన గుర్తింపు లేకపోవడం చాలా కాలంగా సమస్యగా ఉంది. రైతులు వివిధ రకాల వంగడాలను సాగు చేయడం వల్ల కొనుగోలు, నిల్వ, మిల్లింగ్, ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, మిల్లర్లు, ఎగుమతిదారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశాల్లో మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉన్న సన్న రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ జాబితాలో తెలంగాణ సోనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్‌) అభివృద్ధి చేసిన ఈ రకం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండటంతో మధుమేహ బాధితులు, ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారుల్లో తెలంగాణ సోనాకు మంచి డిమాండ్‌ ఉంది. సాంబా మసూరి ఇప్పటికీ దేశీయ మార్కెట్‌లో అత్యధిక ఆదరణ పొందుతున్న సన్నబియ్యం రకాల్లో ఒకటిగా కొనసాగుతోంది.  


రైతుల పరుగులు.. వ్యాపారుల లాభాపేక్ష 
ప్రభుత్వం ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలను సిద్ధం చేసింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్‌కు సుమారు 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 38 లక్షల క్వింటాళ్లకుపైగా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్‌ఎంటీ సోనాతో పాటు ఏడు రకాల విత్తనాలనే ఎక్కువగా కోరుతుండటంతో కొన్ని కేంద్రాల్లో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో రైతులు ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లి విత్తనాల కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొందరు వ్యాపారులు లాభాపేక్షతో నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్‌ఎంటీ సోనా , జై శ్రీరాం విత్తనాలకు కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులు డిమాండ్‌ ఉన్న విత్తనాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ, ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement