HMDA: భూములు వేలం.. హెచ్‌డీఎంకు బిడ్డర్ల ఝలక్‌ | Sakshi
Sakshi News home page

HMDA: భూములు వేలం.. హెచ్‌డీఎంకు బిడ్డర్ల ఝలక్‌

Published Thu, Oct 12 2023 12:19 PM

Bidders Becoming Defaulters In HMDA Lands E-auction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు బిడ్డర్లు హ్యాండ్‌ ఇచ్చారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇటీవల ఈ-వేలంలో ప్లాట్లకు పాటపాడి బిడ్డర్లు డబ్బులు చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారుతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఆరు లేఅవుట్లలో ఏకంగా 497 మంది డిఫాట్లర్టుగా మారడం గమనార్హం. కాగా, డబ్బులు చెల్లించేందుకు నిర్ణీత గడువు కంటే ఎaక్కువ సమయం ఇచ్చినా బిడ్డర్లు మిగతా వాయిదాలు చెల్లించలేదు. దీంతో, ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్‌ఎండీఏ జప్తు చేసింది.

వివరాల ప్రకారం.. హెచ్‌ఎండీఏలో ఈ-వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారిలో చాలామంది డిఫాల్టర్లుగా నిలిచారు. ఆరు లేఅవుట్లకు సంబంధించి 497 మంది చెల్లింపులు చేయలేక చేతులెత్తేశారు. వారికి నిర్ణీత గడువు కంటే మరికొంత సమయం ఇచ్చినా సొమ్ము చెల్లించలేదు. ఈ క్రమంలో చేసేదేమీ లేకపోవడంతో ఆ ప్లాట్ల ధరావతు సొమ్ము రూ.4.5 కోట్లకుపైగా హెచ్‌ఎండీఏ జప్తు చేసింది. 

ఇక, మోకిలలో ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో చదరపు గజం రూ.లక్ష పలకడం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా అధిక ధరకు ప్లాట్లు దక్కించుకున్న చాలామంది డబ్బులు చెల్లించడంలో వెనకడుగు వేశారు. ఒక్క మోకిలలోనే 148 మంది వరకు డిఫాల్టర్లుగా మిగిలారు. షాబాద్‌లో 50 ప్లాట్లకుగాను కేవలం 10 మందే చెల్లింపులు చేశారు. తొర్రూరులో 504 ప్లాట్లకు 114 మంది డబ్బులు కట్టలేదు. మిగతా లేఅవుట్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

ఆరు నెలల్లో మోకిల, మేడిపల్లి, బాచుపల్లి, బహదూర్‌పల్లి, తొర్రూరు, షాబాద్‌ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేసింది. వేలంలో పాల్గొనాలంటే ప్రతి ప్లాటుకు తొలుత రూ.లక్ష ధరావతు చెల్లించాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం తక్కువ ఉంటుంది. అలా వేలంలో ప్లాటు దక్కించుకున్న తర్వాత మిగతా మొత్తం కట్టకుంటే డిఫాల్టర్లుగా తేల్చి ఆ ధరావతును జప్తు చేస్తారు. అంతేకాక డిఫాల్టర్లు భవిష్యత్తులో వేలంలో పాల్గొనలేరు.

Advertisement
Advertisement