సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ పరిధిలోని మరిన్ని భూములకు నేడు వేలం జరగనుంది. మూడు రోజుల్లో ఈ వేలం ప్రక్రియ కొనసాగనుంది. కోకాపేట నియో పోలిస్‌లోని ప్లాట్లను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్దమైంది. దీంతో, భూములకు ఎంత ధర పలకనుంది? అనేది ఉత్కంఠగా మారింది.
కోకాపేట నియో పోలిస్‌లో 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను వేలం వేసేందుకు హెచ్ఎండీఏ సిద్దమైంది. ఒక్కో ఎకరానికి 99 కోట్ల ఆఫ్‌సెట్ ధరను హెచ్ఎండీఏ నిర్ణయించింది. అలాగే, గోల్డెన్ మైల్‌లోని సైట్-2లో 1.98 ఎకరాలు, మూసాపేట్‌లో 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల్లోని రెండు సైట్లను కూడా హెచ్‌ఎండీఏ వేలం వేయనుంది. కాగా, సోమవారం ఉదయం 11 గంటలకు నియో పోలిస్ వెంచర్‌లోని 17, 18 ప్లాట్లను హెచ్‌ఎండీఏ విక్రయించనుంది. నవంబర్ 24, 28, డిసెంబర్ మూడు తేదీల్లో ఈ వేలం ప్రక్రియ జరుగుతుంది.
ఈ క్రమంలో కోకాపేట్ ప్లాట్లకు ఎకరానికి 99కోట్లు, గోల్డెన్ మైల్‌కు 70కోట్లు, మూసాపేట్ సైట్‌ను 75 కోట్ల చొప్పున ఆఫ్‌సెట్ ధరను నిర్ణయించింది. హుడా ఆధ్వర్యంలో కూకట్‌పల్లి మండలంలోని మూసాపేట్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 121-141, 146, 147, 155-157లోని 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల విస్తీర్ణంలోని రెండు సైట్లను విక్రయించడానికి హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ భూములను స్థానికులకు మౌలిక వసతులు కల్పించేందుకు వినియోగించాలని డిమాండ్ ఉంది.
ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో హుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతమైన మూసాపేటలో 15ఎకరాల విస్తీర్ణంలో భూమిని వేలానికి పెట్టింది. పారిశ్రామిక వాడల రవాణా, పార్కింగ్ సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ స్థలాన్ని కేటాయించింది. దశాబ్ధాల కాలం పాటు ఈ ప్రాంతాన్ని ట్రక్ పార్క్‌గా వినియోగించారు. అప్పటి అవసరాలకు అనుగుణంగా నగరానికి వచ్చే వీలు లేకుండా, శివారు ప్రాంతంలోనే ట్రక్కులు, భారీ వాహనాలు నిలుపుకొనేందుకు ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో భారీ వాహనాల తాకిడి తగ్గింది. ఒకవేళ ప్రభుత్వం ఈ భూములను విక్రయిస్తే.. ట్రక్కు పార్కింగ్ యార్డు కనుమరుగు కానుంది. ఇక భవిష్యత్తులో ఈ ప్రాంతం భారీ నిర్మాణ కార్యకలాపాలతో నిండిపోనుందని పలువురు చెబుతున్నారు.


