అధికారులు ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై హైకోర్టు మండిపాటు
సాక్షి, అమరావతి : ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడంలేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మాంసం, చేపల దుకాణాల కేటాయింపునకు సైతం ‘ఈ–వేలం’ నిర్వహించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. కంప్యూటర్‌పై కనీస పరిజ్ఞానం కూడా లేని చిన్న వ్యాపారులకు షాపులు కేటాయించే విషయంలో సాంప్రదాయ బహిరంగ వేలం కాకుండా ఈ–వేలం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది.
ఇందులో పాల్గొనాలంటే పలు డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, ఆ డాక్యుమెంట్లు ఏవనే విషయంపై కూడా ఆ చిరు వ్యాపారులకు అవగాహన ఉండదని, వారిలో చాలా మంది పెద్దగా చదువుకుని ఉండరని తెలిపింది. క్షేత్ర స్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులు ఏసీ రూముల్లో కూర్చొని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఈ–వేలం టెండర్ నోటిఫికేషన్‌ను ఇంగ్లిష్ లో ప్రచురించడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది.
తెలుగు పత్రికలో తెలుగు భాషలో నోటిఫికేషన్‌ను ఇవ్వాలని నిబంధనలు చెబుతుంటే, తెలుగు పత్రికలో ఇంగ్లిష్ లో నోటిఫికేషన్ ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఏం ప్రయోజనాలు ఆశించి ఇలా చేస్తున్నారని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నిలదీసింది. విజయవాడ మహంతి మార్కెట్‌లో షాపుల కేటాయింపు నిమిత్తం ఈనెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఈ–వేలం నోటిఫికేషన్‌ను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిలిపేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ–వేలంపై పిటిషన్
మహంతి మార్కెట్‌లో మాంసం, చేపల దుకాణాల కేటాయింపు కోసం ఈ–వేలానికి ఈ నెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ అదే మార్కెట్‌లో చేపల వ్యాపారం చేస్తున్న హరి మాణిక్యం శంకరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ–వేలం నోటిఫికేషన్ గురించి అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తెలుగు పత్రికలో ఇంగ్లిష్‌లో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. పిటిషనర్‌తో సహా ఇతర వ్యాపారుల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారున్నారని.. దీంతో నోటిఫికేషన్‌కు స్పందించలేకపోయారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలే తప్ప, క్లిష్టతరంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.


