రూ. 586 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వ ఆమోదం
తొలి విడతలో రూ. 200 కోట్ల నిధులతో ఆలయ విస్తరణ
నేడు పూజాది కార్యక్రమాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రగిరి నూతన రూపు సంతరించు కోనుంది. తొలి దశలో రూ. 200 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించగా పురాతన భవనాలు, ఆలయాల కూల్చివేతతోపాటు నిర్మాణ పనుల ప్రారంభానికి శనివారం పూజాదికాలు జరపనున్నారు. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ప్రభు త్వం ఆదేశించింది. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ ప్రతినిధులు, కన్సల్టెన్సీ బాధ్యులు.. ఆలయ ఈఓ దామోదర్‌రావుతో కలిసి రామాలయ పరిసర ప్రాంతాలను శుక్రవారం పరిశీలించి చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
ప్రధానాలయం మినహా సమూలంగా..
16వ శతాబ్దంలో భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయం నిర్మించారు. 1960లో ఆలయంలో గోపురం పనులు చేపట్టారు. అనంతరం స్వల్ప మార్పులు తప్ప ఇప్పటివరకు రామాలయ అభివృద్ధి జరగలేదు. కాలక్రమేణా భద్రాచలానికి భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అయితే రామదాసు నిర్మించిన ప్రధానాలయం మినహా ఇతర ఉపాలయాలు, పరిపాలనా భవనాలు, వంటశాలలు, పూజా మండపాలు, పార్కింగ్ జోన్లు ఇతరత్రా వసతులను జోడించేలా రూ. 586 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించింది.
ఇందులో తొలి విడతగా గోదావరి ఒడ్డున రూ. 75 కోట్లతో పనులు చేపట్టడంతోపాటు ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు రూ. 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి రూ. 96 కోట్లు కలిపి రూ. 351 కోట్ల విలువైన పనులను 2027 నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇందులో కాంప్లెక్స్ విస్తరణ పనుల అంచనాలను రూ. 200 కోట్లకు సవరించి చేపట్టేందుకు సిద్ధమై టెండర్ ఖరారు చేశారు.
ఇతర పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇక రెండో విడతగా 6 ఎకరాల స్థలంలో పార్కింగ్, ఇతర అభివృద్ధి పనులతో రూ. 108 కోట్లతో 2028 నాటికి, మూడో విడతగా భద్రాచలం టెంపుల్ టౌన్ అభివృద్ధిని రూ. 127 కోట్లతో 2029 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. కాగా, ప్రధానాలయానికి ఎలాంటి మార్పులు లేకపోవడంతో భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.


