‘బార్‌’ బరి.. గెలుపెవరిదో మరి! | The Bar Council election schedule has been released | Sakshi
Sakshi News home page

‘బార్‌’ బరి.. గెలుపెవరిదో మరి!

Dec 26 2025 5:20 AM | Updated on Dec 26 2025 5:20 AM

The Bar Council election schedule has been released

బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు మోగిన నగారా

35,316 న్యాయవాదులకు ఓటు హక్కు 

బరిలోకి దిగుతున్న పాత సభ్యులు, కొత్త అభ్యర్థులు

రెండు దశాబ్దాల సేవలతో వైదొలుగుతున్న చైర్మన్‌ 

న్యాయవాద రక్షణ చట్టమే ప్రధాన ఎజెండా

సంక్షేమ పథకాలు తెస్తామంటూ ప్రచారం షురూ 

ఇప్పటికే కోర్టు ఆవరణల్లో భేటీలు

ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల నగారా ఎట్టకేలకు మోగింది. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా.. హైకోర్టు మాత్రం 2018 డిసెంబర్‌ వరకు కలిసే పనిచేసింది. 2019 నుంచి ఇరు హైకోర్టులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బార్‌ కౌన్సిల్‌కు జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. అంటే.. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ మొదటి ఎన్నికలివి. దీంతో తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ‘ప్రాధాన్యత’ క్రమంలో సభ్యులను ఎన్నుకుంటారు. సభ్యులు.. చైర్మన్, వైస్‌ చైర్మన్, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు సభ్యుడిని ఎన్నుకుంటారు. 

25 మంది సభ్యుల కోసం జరిగే ఈ ఎన్నికల్లో దాదాపు 100 మందికి పైగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు జిల్లాల్లోని కోర్టుల్లో తిరుగుతూ ప్రచారం షురూ చేశారు. మరికొందరు త్వరలో రంగంలోకి దిగనున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ సందర్భంగా బార్‌ కౌన్సిల్‌ ఎప్పుడు ఏర్పడింది? దాని విధులేంటి?.. తదితర ఆసక్తికర అంశాలపై కథనమిది. – సాక్షి, హైదరాబాద్‌

వృత్తిపరమైన విభేదాలతో న్యాయవాదిపై దాడి చేసినా.. హింసించినా ఎవరిని ఆశ్రయించాలి?.. న్యాయవాది సంక్షేమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? న్యాయ విద్యాలయాలకు అనుమతులు, సీట్ల కేటాయింపు.. వీటికి సమాధానమే బార్‌ కౌన్సిల్‌. ఇది ఓ చట్టబద్ధమైన సంస్థ. న్యాయవాదిగా నమోదు చేసుకోవడం, వారి హక్కులు, అధికారాలు, ప్రయోజనాలు కాపాడటం, దుష్ప్రవర్తనకు పాల్పడితే ఫిర్యాదులు స్వీకరించి చర్యలు చేపట్టడం.. ఇదంతా బార్‌ కౌన్సిల్‌ విధి. 

దేశవ్యాప్తంగా అతిపెద్ద చట్టబద్ధమైన సంస్థలో బీసీఐ ఒకటి. న్యాయవాదుల చట్టం ప్రకారం రాష్ట్ర కౌన్సిల్‌లో న్యాయవాదుల సంఖ్య 10,000 దాటితే సభ్యులు 25 మంది ఉండాలి. ఈ మేరకు తెలంగాణ కౌన్సిల్‌లో సభ్యుల సంఖ్య 25. వీరు చైర్మన్, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. బరే యాక్ట్‌ చాప్టర్‌ 2 ప్రకారం రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుల కాల పరిమితి ఐదేళ్లు. ఆ తర్వాత 6 నెలల వరకు పొడిగించే అధికారం బీసీఐకి ఉంది. 

బీసీఐ అవసరాన్ని నొక్కి చెబుతూ 1953లో ఎస్‌ఆర్‌ దాస్‌ నేతృత్వంలోని ‘ఆల్‌ ఇండియా బార్‌ కమిటీ’ ఓ నివేదిక సమర్పించింది. ప్రతి రాష్ట్రానికో బార్‌ కౌన్సిల్‌ ఉండాలని, వీటన్నింటిపై అత్యున్నత సంస్థగా అఖిల భారత స్థాయి బార్‌ కౌన్సిల్‌ పర్యవేక్షణ ఉండాలని ప్రతిపాదించారు. అనంతరం 1961లో న్యాయవాదుల చట్టం అమల్లోకి వచ్చింది. 

ఇందులో సెక్షన్‌ 3 మేరకు ప్రతి రాష్ట్రానికో బార్‌ కౌన్సిల్‌ ఉండాలన్న నిబంధన ప్రకారం ఉమ్మడి ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఏర్పాటు జరిగింది. 2018, జూలైలో తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో దాదాపు 50,785కి పైగా న్యాయవాదులున్నారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు సభ్యుల ఎన్నికలో వీరంతా ఓటర్లుగా ఓటు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో ‘ప్రాధాన్యత’ ఓటు ఆధారంగా సభ్యులను ఎన్నుకుంటారు. 

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ విధులు..
» న్యాయవిద్య పూర్తి చేసిన వారిని న్యాయవాదులుగా చేర్చుకోవడం
» వారి జాబితాను సిద్ధం చేయడం, విధులను పర్యవేక్షించడం 
» న్యాయవాదులెవరైనా దుష్ప్రవర్తనకు పాల్పడితే కేసులను స్వీకరించడం, చర్యలు చేపట్టడం 
» న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను కాపాడటం
» నిరుపేదలు, దివ్యాంగులు, ఇతర న్యాయవాదుల కోసం సంక్షేమ పథకాల నిర్వహణ
»  విపత్కర సమయాల్లో పేద న్యాయవాదులకుఆర్థిక సహాయం అందించడం
» ప్రముఖ న్యాయనిపుణులతో చట్టపరమైన అంశాలపై సెమినార్లు, చర్చలు నిర్వహించడం 
»  పేదలకు నిర్దేశించిన పద్ధతిలో న్యాయ సహాయం అందించడం
»  న్యాయ విశ్వవిద్యాలయాలను, కాలేజీలను తనిఖీ చేయడం
»  న్యాయ విద్య పూర్తి చేసిన వారికి విధిగా బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పరీక్ష నిర్వహించాలి

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా..
దేశవ్యాప్తంగా న్యాయవాదుల వృత్తిని నియంత్రించడానికి, ప్రాతినిధ్యం వహించడానికి పార్లమెంట్‌ ఏర్పాటు చేసిన ఓ చట్టబద్ధమైన సంస్థ. వృత్తిపరమైన ప్రవర్తన, మర్యాదల ప్రమాణాలను నిర్దేశించడం, బార్‌పై క్రమశిక్షణ అధికార పరిధిని అమలు చేస్తూ నియంత్రణ విధులను నిర్వహిస్తారు. 
»   న్యాయ విద్యకు ప్రమాణాలను కూడా నిర్దేశిస్తుంది
»   న్యాయవాదులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికార పరిధి ఉంటుంది
»  న్యాయవాదుల విధులను నియంత్రిస్తుంది. 
»  న్యాయ డిగ్రీ విశ్వవిద్యాలయాలకు గుర్తింపును మంజూరు చేస్తుంది
»   న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను పరిరక్షిస్తుంది
»  సంక్షేమ పథకాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించడానికి నిధులను సృష్టిస్తుంది
» న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తన, ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
»  రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ క్రమశిక్షణ కమిటీలు అనుసరించాల్సిన విధానం నిర్దేశం
»   న్యాయవాదుల హక్కులు, అధికారాలు, ప్రయోజనాలను కాపాడటం
»  చట్ట సంస్కరణలను ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం
»  రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సూచించే ఏదైనా సమస్యను పరిష్కరించడం
»   బార్‌ కౌన్సిల్‌ నిధుల నిర్వహణ.. పెట్టుబడి పెట్టడం
»  ప్రతి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ నుంచి ఐదేళ్ల కాలపరిమితితో బీసీఐకి సభ్యులు ఎన్నికవుతారు. 
»  వీరంతా రెండేళ్ల కాలపరిమితికి చైర్మన్, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు.
»  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో అటార్నీ జనరల్‌ ఎక్స్‌–అఫీషియో సభ్యునిగా ఉంటారు.
»  బీసీఐ తొలి చైర్మన్‌ ఎంసీ సెతల్వాడ్‌. ప్రస్తుతం మనన్‌ కుమార్‌ మిశ్రా.
»  దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో బార్‌ కౌన్సిళ్లు ఉన్నాయి.

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 25 
వీరిలోచైర్మన్,వైస్‌ చైర్మన్‌ల సంఖ్య 2
బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు నామినేటయ్యే సభ్యుల సంఖ్య 1
ఎక్స్‌–అఫీషియో సభ్యుల సంఖ్య 1 (అడ్వొకేట్‌ జనరల్‌)

ఆలిండియా బార్‌ కౌన్సిల్‌ పరీక్ష
న్యాయవాద వృత్తి ప్రమాణాలను మెరుగుపరచడమే ఏకైక ఉద్దేశంతో బీసీఐ దీన్ని ప్రవేశపెట్టింది. 2009–2010 విద్యా సంవత్సరం నుంచి పట్టభద్రులైన న్యాయ విద్యార్థులకు ఈ పరీక్ష తప్పనిసరి చేస్తూ బీసీఐ నిర్ణయం తీసుకుంది. న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్‌ 24 ప్రకారం న్యాయవాదులుగా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థికి ప్రాక్టీస్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. 

దేశంలోని ఏ కోర్టులోనైనా ప్రాక్టీస్‌ చేయడానికి అర్హత ఉంటుంది. ఈ పరీక్ష దేశంలోని జాతీయ, ప్రాంతీయ భాషల్లో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థి విశ్లేషణాత్మక నైపుణ్యాలను అంచనా వేయడంతో పాటు, ప్రాథమిక స్థాయి జ్ఞానాన్ని అంచనాకు, న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించడానికి కనీస బెంచ్‌మార్క్‌ను ఈ పరీక్ష నిర్దేశిస్తుంది. న్యాయ విద్య పట్టా పొందినా వృత్తిలోకి ప్రవేశించడానికి ఆసక్తి లేని వారికి ఈ పరీక్ష అవసరం లేదు. 

న్యాయవ్యవస్థ ప్రధాన పిల్లర్‌ న్యాయవాదులే..
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించే న్యాయవ్యవస్థకు ప్రధాన పిల్లర్‌ న్యాయవాదులే. అలాంటి వారి రక్షణకు చట్టం అవసరం తప్పనిసరి. వైరి కక్షిదారుల బెదిరింపులు, దాడులు, హత్యలు ఇటీవల కాలంగా పెరిగిపోయాయి. యువ న్యాయవాదులకు శిక్షణా తరగతులు అవసరం. అత్యుత్తమ న్యాయవాదులను తయారు చేస్తే న్యాయవ్యవస్థ ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది. సత్వర న్యాయానికి దోహదం చేస్తుంది.  – బీఎస్‌ ప్రసాద్, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌

సంక్షేమానికి పాటుపడాలి
బార్‌ కౌన్సిల్‌ న్యాయవాదులు సంక్షేమానికి పాటుపడాలి. మరిన్ని పథకాలు అమలు చేసే దిశగా కృషి చేయాలి. వీలైతే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి న్యాయవాదుల సమస్యలను వివరించాలి. జిల్లా కోర్టుల్లో డిస్‌ప్లే బోర్డుల సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేసు ఎప్పుడు వస్తోందో తెలియక న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టంతోపాటు ఇలాంటి సమస్యలు పరిష్కరించే ‘కౌన్సిల్‌’ను ఎన్నుకోవాలి.  – పొన్నం అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు, హెచ్‌సీఏఏ 

న్యాయవాదులకు ఆప్తుడు వైఎస్సార్‌
న్యాయవాదులకు ఆప్తుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. నేరుగా కౌన్సిల్‌కు సాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆయన. దాదాపు 20 ఏళ్లుగా చైర్మన్‌గా సేవలందిస్తున్నాను. రెండు దశాబ్దాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఇతర సభ్యులు, న్యాయవాదులు అందరూ తమ వంతు సహకరించారు. 

ఇన్నేళ్లు చైర్మన్‌గా కొనసాగడం ఓ రికార్డే. 2006 చైర్మన్‌గా తొలిసారి వైఎస్సార్‌ను కలిశా. అడిగిన వెంటనే రూ.1.65 కోట్లను మంజూరు చేశారు. విడతలవారీగా ఒక్కో పని చేసుకుంటూ పోదామని చెప్పారు. అడిగిన వెంటనే నిధులిచ్చే అలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ చూడలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.3 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో సగం మంజూరు చేశారు. – నరసింహారెడ్డి, చైర్మన్, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ 

ప్రధాన హామీ.. న్యాయవాద రక్షణ చట్టం
న్యాయవాదులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. వైరి వర్గాల వారు హత్య చేయడం, దాడులు చేయడం సర్వసాధారణంగా మారింది. ఓ న్యాయవాద దంపతుల కేసును సుప్రీంకోర్టు ఏకంగా సీబీఐకే అప్పగించింది. ఈ నేపథ్యంలో న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలన్నది ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. యువ న్యాయవాదులకు స్టైపెండ్, శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, జీవిత బీమా, ప్రమాద బీమా మరింత మందికి అందుబాటులోకి తెస్తామని, సడలింపులు చేస్తామంటూ ప్రచారం సాగించనున్నారు. 

పకడ్బందీగా నిర్వహణ
బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటర్ల జాబితాను రాష్ట్రంలో అన్ని బార్‌ అసోసియేషన్లకు పంపిన తర్వాతే తుది జాబితాను ప్రచురించాం. సుప్రీంకోర్టు నియమించిన ఎన్నికల కమిటీ సూచనల మేరకు చర్యలు చేపడుతున్నాం. ఎన్నిక లు ప్రజాస్వామ్యానికి నిదర్శనం. న్యాయవాదులు తమ ఓటు వినియోగించుకోవాలని కోరుతున్నాం.  – నాగలక్ష్మి, కార్యదర్శి, బార్‌ కౌన్సిల్‌ 

ఎన్నికలు నిర్వహించండి..
రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నవంబర్‌లో తీర్పునిచ్చింది. ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించాలో గడువు నిర్దేశించింది. ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి ఎన్నికల కమిటీ పర్యవేక్షణ జరుపుతుంది.

జనవరి 31: ఉత్తరప్రదేశ్, తెలంగాణ
ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, త్రిపుర, పుదుచ్చేరి
మార్చి 15: రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, గుజరాత్, పంజాబ్‌
మార్చి 31: మేఘాలయ, మహారాష్ట్ర
ఏప్రిల్‌ 30: తమిళనాడు, కేరళ, అస్సాం

ఉన్నతస్థాయి కమిటీ..
జస్టిస్‌ రవిరాజన్‌ (చైర్మన్‌)
మాజీ ప్రధాన న్యాయమూర్తి, జార్ఖండ్‌ హైకోర్టు
జస్టిస్‌ ఏఆర్‌ మక్సూది మాజీ న్యాయమూర్తి, అలహాబాద్, హైకోర్టు
జస్టిస్‌ రేఖా పల్లి మాజీ న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు

ప్రస్తుత బార్‌ కౌన్సిల్‌ ఏం చేసింది..?
»  న్యాయవాది మరణ ప్రయోజనాలను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు 
» కోవిడ్‌ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.25 కోట్లు మంజూరు చేసేలా సర్కార్‌ను ఒప్పించడం
» కరోనా మహమ్మారి కష్టకాలంలో అనేక మంది నిరుపేద న్యాయవాదులకు ఆర్థిక సహాయం పంపిణీ 
» అంతర్గత సెమినార్ల నిర్వహణ, ఐసీఎఫ్‌ఏఐ లా స్కూల్‌తో కలిసి రెండు రోజుల కీలకసెమినార్‌
»  ఉమ్మడి బార్‌ కౌన్సిల్‌ విభజన తర్వాత తలెత్తిన వివిధ సమస్యలను విజయవంతంగా పరిష్కరించడం
» న్యాయవాదులు వృత్తికి సంబంధించి సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం 
»  నిర్ణీత వయసు (35 ఏళ్లు) దాటిన న్యాయవాదులు అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌లో సభ్యులు కావడానికి అవకాశం కల్పించడం. 

తెరపైకి మహిళా రిజర్వేషన్‌
రాష్ట్ర బార్‌ కౌన్సిళ్ల పదవుల్లో 30 శాతాన్ని మహిళా న్యాయవాదులకు కేటాయించాలి. ఈ ఏడాది ఇంకా బార్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాని రాష్ట్రాల్లో ఈ ఆదేశాలను అమలు చేయాలి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మాత్రం నోటిఫికేషన్‌ ప్రకారం ముందుకు సాగవచ్చు. 

ఒకవేళ తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకున్నా, పోటీ చేయడానికి ఇష్టపడకున్నా.. 20 శాతం పదవులను ఎన్నిక ద్వారా, మిగిలిన 10 శాతం పదవులను కో–ఆప్షన్‌ ద్వారా నియమించుకోవచ్చు. కో–ఆప్షన్‌ ద్వారా నియమించేందుకు ప్రతిపాదించే మహిళా న్యాయ వాదుల పేర్లను తొలుత కోర్టు ముందు ఉంచాలి.

మహిళలకు సీట్ల రిజర్వు హర్షణీయం
మహిళలకు 30 శాతం రిజర్వేషన్‌ పాటించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు హర్షణీయం. దశాబ్దాల తర్వాత బార్‌ కౌన్సిల్‌లో మహిళలకు సముచిత స్థానం దక్కనుంది. ఈ బార్‌ కౌన్సిల్‌ కార్యవర్గంలో ఒక్కరూ మహిళలు లేకపోవడం శోచనీయం. చట్టాల అమలు కోసం సమర్థవంతమైన వాదనలు వినిపించే మహిళా న్యాయవాదులు ముందుకు రావాలి. కేసులకే పరిమితం కాకుండా ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధించి మహిళా న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడాలి.  – జి.సుభాషిణి, న్యాయవాది 

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలి..
ఈ వృత్తిలో న్యాయవాద సంబంధిత అంశాలతో పాటు అంగ్ల పరిజ్ఞానం తప్పనిసరి. పేద, మధ్య తరగతి న్యాయవాదుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారున్నారు. వారు ఇబ్బంది పడకుండా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు బార్‌ కౌన్సిల్‌ కృషి చేయాలి. స్కిల్స్‌ లేకుండా రాణించడం కష్టం. కోర్టులో వాదనలు ఎలా జరుగుతాయి.. క్రిమినల్, సివిల్‌ చట్టాలపై తరగతులు నిర్వహించాలి. వారు కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇచ్చి భయాందోళన దూరం చేయాలి. దీని కోసం కౌన్సిల్‌ కృతనిశ్చయంతో పనిచేయాలి.  – పాలకుర్తి కిరణ్, మాజీ న్యాయమూర్తి

ముఖ్యమైన పాయింట్లు...
»  1961లో బార్‌ కౌన్సిళ్లు ఏర్పాటైనా.. చైర్మన్ల ఎన్నిక మాత్రం 1969 నుంచి ప్రారంభమైంది. అప్పటివరకు అడ్వొకేట్‌ జనరల్‌ ఎక్స్‌ అఫీషియోమెన్‌ హోదాలో చైర్మన్‌గా ఉండేవారు. 
»  బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తొలి చైర్మన్‌ ఎంసీ సెతల్వాడ్‌
» ఆర్‌బీ జఠ్మలానీ, వీసీ మిస్త్రా, మనన్‌ కుమార్‌ మిస్త్రా.. బీసీఐ చైర్మన్‌గా రెండు సార్లు ఎన్నికయ్యారు.
» మనన్‌కుమార్‌ మిస్త్రా.. అత్యధిక కాలం... దాదాపు 14 ఏళ్లు చైర్మన్‌గా సేవలందించారు. 2012, ఏప్రిల్‌ 17 నుంచి 2014, ఏప్రిల్‌ 16 వరకు.. 2014, నవంబర్‌ 9 నుంచి ప్రస్తుతం...
»  దేశవ్యాప్తంగా మొత్తం 24 బార్‌ కౌన్సిళ్లున్నాయి. 
» మహారాష్ట్ర, గోవా బార్‌ కౌన్సిల్‌లో 2 లక్షలకుపైగా న్యాయవాదులున్నారు. 

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల షెడ్యూల్‌..
ప్రాథమిక ఓటర్ల జాబితా జారీ: డిసెంబర్‌ 1
తుది జాబితా విడుదల: డిసెంబర్‌ 10
నోటిఫికేషన్‌ గెజిట్‌ జారీ: డిసెంబర్‌ 20
నామినేషన్లు ప్రారంభం: డిసెంబర్‌ 29
నామినేషన్లు గడువు ముగింపు: జనవరి 9
నామినేషన్ల పరిశీలన: జనవరి 10
నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం:
జనవరి 13 నుంచి 16 వరకు
అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ: జనవరి 17
బ్యాలెట్‌ పేపర్లు, బాక్సుల పంపిణీ: జనవరి 19
ఎన్నికల తేదీ: జనవరి 30
ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 10
(బార్‌ కౌన్సిల్‌కు పోటీ చేయాలనుకునే వారు రూ.1.25 లక్ష ల నాన్‌ రిఫండబుల్‌ రిక్లరేషన్‌ సమర్పించాలి. ఒక్కో అభ్యర్థి కి మద్దతుగా 10 మంది న్యాయవాదులు సంతకం పెట్టాలి)
ఓటు హక్కు వినియోగించుకోనున్న మొత్తం ఓటర్ల సంఖ్య: 35,316
మహిళలు: 7,637 
పురుషులు: 27,679 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement